స్పోర్స్ట్ డెస్క్- టీ20 వరల్డ్ కప్‌లో పసికూన స్కాట్లాండ్ క్రికెట్ జట్టు మొట్టమొదటి సారి ప్రధాన టోర్నీకి అర్హత సాధించింది. గురువారం రాత్రి జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్ లో ఒమన్ ని 8 వికెట్ల తేడాతో ఓడించింది స్కాట్లాండ్. దీంతో స్కాట్లాండ్ సూపర్-12లోకి దూసుకొచ్చింది.
గ్రూప్-బిలో ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ గెలిచిన స్కాట్లాండ్ పాయింట్ల పట్టికలోనూ టాప్‌లో నిలిచింది. ఇక రెండు విజయాలతో బంగ్లాదేశ్ రెండో స్థానంలో నిలిచింది. గ్రూప్- బి నుంచి ఈ రెండు జట్లే సూపర్-12కి అర్హత సాధించాయి. గ్రూప్-బిలో మిగిలిన ఒమన్, పవువా న్యూ గినియా ఇంటిబాట పట్టాయి.
గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఒమన్ సరిగ్గా 20 ఓవర్లలో 122 పరుగులకి ఆలౌటైంది. ఆ జట్టులో ఓపెనర్ అకిబ్ లైస్ (37: 35 బంతుల్లో 3×4, 2×6) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మక్సూద్ (34: 30 బంతుల్లో 3×4, 1×6), మహ్మద్ నదీమ్ (25: 21 బంతుల్లో 2×6) విలువైన పరుగులు చేశారు. స్కాట్లాండ్ బౌలర్లలో దవేయ్ మూడు వికెట్లు పడగొట్టగా, లెస్క్, షరీప్ రెండు, మార్క్ వాట్ ఒక వికెట్ తీసుకున్నారు.
స్కాట్లాండ్ 123 పరుగుల ఛేదనలో కెప్టెన్ కైల్ కూజెర్ (41: 28 బంతుల్లో 2×4, 3×6) దూకుడుగా ఆడగా, ఆ తర్వాత మాథ్యూ క్రాస్ (26: 35 బంతుల్లో), బెర్రింగ్టన్ (31: 21 బంతుల్లో 1×4, 3×6) నిలకడగా ఆడి గెలుపు లాంఛనాన్ని 17 ఓవర్లలోనే 123/2 తో పూర్తి చేశారు. ఇంకేముంది స్కాట్లాండ్ దర్జాగా సూపర్-12కి అర్హత సాధించేసింది. టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో తొలిసారి ప్రధాన టోర్నీలో ఆడబోతోంది స్కాట్లాండ్.