ఖమ్మం రూరల్- తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికలు ముగిసినా వివాదాలు మాత్రం ముగియడం లేదు. మా ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు నుంచే రాజకీయ ఎన్నికల తరహాలోనే ప్రచారం జోరుగా సాగింది. మా ఎన్నికలు ఈ నెల 10వ తేదీన జరగ్గా మంచు విష్ణు ప్యానెల్ గెలుపొందగా, ప్రకాష్ రాజ్ ప్యానెల్ ఓటమిపాలైంది. ఐతే మా ఎన్నికల పోలింగ్ రోజున డైలాగ్ కింగ్ మోహన్ బాబు, ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యులపై దురుసుగా ప్రవర్తించారు.
ఈ సందర్బంలో మోహన్ బాబు కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మోహన్ బాబు వ్యాఖ్యలు కాస్త వివాదస్పదం అయ్యాయి. ఈ క్రమంలో మోహన్ బాబుపై ఏకంగా పోలీసు కేసు నమోదైంది. మా ఎన్నికల పోలింగ్ రోజు మోహన్ బాబు ఏమన్నారంటే.. అసలు ఏం జరుగుతోంది.. ఇవి ఎన్నికలా.. కదా.. నాన్సెన్స్.. అందరూ నిరక్షరాస్యులే.. అందరూ చూస్తున్నారు.. అని అన్నారు.
అంతే కాదు.. గొర్రెలు కాసే వాని దగ్గర కూడా మొబైల్ ఫోన్ ఉంది.. వాళ్లు మన గొడవలను రికార్డ్ చేస్తారు.. జాగ్రత్తగా ఉండండి.. అసలు గొడవ ఎందుకు.. అంటూ మోహన్ బాబు ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులపై సీరియస్ అయ్యారు. ఇంకేముంది, మోహన్ బాబు మాట్లాడిన మాటలు, తమ మనోభావాలను దెబ్బతీసాయని రాష్ట్ర గొర్రెలు మరియు మేకల కాపలా దారుల సంఘం ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర సంఘం ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంఘం నేతలు మోహన్ బాబు పై పోలీస్ కేసు పెట్టారు. గొర్రె కాపురులను చిన్నచూపుతో మాట్లాడడం చాలా దారుణమని, మోహన్ బాబు పై చర్యలు తీసుకోవాలని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. రాష్ట్ర గొర్రెలు మరియు మేకల కాపు దారు ల అందరికీ మోహ న్ బాబు బేషరతుగా క్షమాప ణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. మరి ఈ అంశంపై మోహన్ బాబు ఎలా స్పందిస్తారన్నదే ఆసక్తికరంగా మారింది.