యాదృచ్చికమో, విధి వంచితమో తెలియదు కానీ..ఒకే ఇంట్లో మరణాలు ఒకే తరహాలో సంభవిస్తుంటాయి. ఒకే ప్రమాదంలో కుటుంబాలు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చూశాం. ఆత్మీయులు చనిపోయారన్న షాకింగ్ న్యూస్ విని కుటుంబ సభ్యుల్లోని వారు గుండె పోటుతో కొన్ని గంటటల వ్యవధిలో చనిపోయిన ఘటనలు విన్నాం. అటువంటి చదివినా, విన్నా.. మదిని కలచివేస్తోంది. కానీ, నేపాల్ లో ఇటీవల జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన కో పైలట్ అంజు ఖతివాడ విషయంలో 16 ఏళ్ల తర్వాత..మరణ శాసనం.. సీన్ రిపీట్ చేసింది. అదీ కూడా ఒకే విమానయాన సంస్థకు చెందిన విమాన ప్రమాదాల్లో మరణించడం విధి ఆడిన వింత నాటకంలా మారింది.
వివరాల్లోకి వెళితే.. అంజు ఖతివాడ భర్త దీపక్ కూడా నేపాల్ ఆర్మీలో హెలికాఫ్టర్ కో పైలట్ గా పనిచేశారు. అంజును వివాహం చేసుకున్నాక యతి ఎయిర్ లైన్స్ లో జాయిన్ అయ్యారు. 2006లో నేపాల్ నుండి జుమ్లా వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో దీపక్ చనిపోయారు. ఆ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణీకులు, నలుగురు సిబ్బంది చనిపోయారు. భర్త మరణం తర్వాత ఆయన బాటలోనే నడవాలనుకున్న అంజు .. పైలట్ కోర్సును కంప్లీట్ చేశారు. 2010లో యతి ఎయిర్ లైన్స్ లోనే చేరారు. త్వరలోనే పైలట్ గా ప్రమోట్ కావాల్సి ఉండగా.. విధి, ఆమె ఆశల్ని అడియాశలు చేసింది.
నేపాల్ నిబంధనల ప్రకారం.. పైలట్ కావాలంటే.. కో-పైలట్ గా కొన్ని గంటల పాటు విమానం నడపాల్సిన అనుభవం అవసరం. అయితే అంతటి అనుభవాన్ని సంపాదించేందుకు అదే చివరి అవకాశం. ఆ విమానం సురక్షితంగా చేరి ఉంటే పైలట్ గా ప్రమోట్ అయ్యేవారు. నేపాల్ లోని అన్ని ఎయిర్ పోర్టుల్లోనూ విజయవంతంగా విమానాలను ల్యాండింగ్ చేసిన అనుభవం ఉంది. అంతలోనే విమాన ప్రమాదానికి గురై చనిపోయింది. అనుకోకుండా భర్త తరహాలోనే.. భార్య కూడా విమాన ప్రమాదంలో మరణించడం కన్నీరు తెప్పిస్తుంది. కాగా, అంజు ఆంధ్రప్రదేశ్ తో అవినాభావ సంబంధం ఉంది. తెనాలిలోని వివేకానంద జూనియర్ కళాశాలలో ఆమె ఇంటర్మీడియెట్ పూర్తి చేశారు. అంజు మరణ వార్త తెలుసుకున్న అప్పటి ఆమె స్నేహితులు.. కన్నీరుమున్నీరువుతున్నారు.