అమరావతి- నర్సాపురం పార్లమెంట్ సభ్యుడు రఘురామ కృష్ణరాజును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం అయనను ఏపీ సీఐడీ పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేసి గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తీసుకెళ్లారు. రఘురామ కృష్ణరాజు అరెస్ట్ పై ఏపీ హైకోర్టులో హౌన్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ఇండియన్ పీవల్ కోడ్.. ఐపీసీ నిబంధనల ప్రకారం రఘురామ కృష్ణరాజును అరెస్టు చేయలేదని ఆయన తరపున అడ్వకేట్లు హైకోర్టులో హౌస్ పిటిషన్ దాఖలు చేశారు. రఘురామ కృష్ణరాజుకు ఈ మధ్యనే గుండె ఆపరేషన్ అయ్యిందని. ఆయనకు ఇకర అనారోగ్య సమస్యలు ఉన్నాయని వాయర్లు పిటీషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు శనివారం మధ్యాహ్నం విచారణ జరపనుందని తెలుస్తోంది. ఐతే హౌస్ మోషన్ పిటీషన్ పై విచారణ పూర్తయ్యే వరకు ఎంపీ రఘురామ కృష్ణరాజును మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచొద్దని సీఐడీ పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
సీఐడీ పోలీసులు కస్టడీలో ఉన్న రఘురామ కృష్ణరాజుకు అన్ని సదుపాయాలు కల్పించాలని హైకోర్టు స్పష్టం చేసింది. వైద్య సేవలతో పాటు, ఆహారం, వసతి వంటి సౌకర్యాలు ఇవ్వాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఐతే ఇప్పటికే సీఐడీ పోలీసులు ఎంపీ రఘురామ కృష్ణ రాజును శుక్రవారం రాత్రి నుంచే విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేయడానికి వెనుక ఎవరి ప్రోద్బలమైనా ఉందా అని పోలీసులు రఘురామను ప్రశ్నించినట్లు సమాచారం. ఐతే తాను కేవలం ప్రభుత్వ తప్పిదాలను మాత్రమే ఎత్తిచూపానని, ప్రభుత్వ ప్రతిష్టకు ఎక్కడా భంగం కలిగించేలా వ్యవహరించలేదని రఘురామకృష్ణ రాజు పోలీసులకు చెప్పారని తెలుస్తోంది. మొత్తానికి ఇప్పుడు అందరి చూపు హైకోర్టు విచారణపై పడింది. రఘురామ కృష్ణరాజు అరెస్ట్ పై హైకోర్టు ఏం తీర్పు చెబుతుందా అన్నది రాజకీయావర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.