స్పోర్ట్స్ డెస్క్- పాకిస్థాన్ క్రికెట్ జట్టు మరోసారి తన సహజ బుద్దిని బయటపెట్టింది. ఈసారి టీ-20 ప్రపంచకప్ 2021 లో టీమ్ ఇండియాపై విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేసింది పాక్. ఈమేరకు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఓవర్ కాన్ఫిడెన్స్ వ్యక్తపరిచాడు. తమ జట్టు టీమిండియాపై పైచేయి సాధిస్తుందని బాబర ధీమా వ్యక్తం చేశాడు. యూఏఈ, ఒమన్ వేదికగా అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకు టీ20 ప్రపంచకప్-2021 జరుగనుంది.
ఈ నేపథ్యంలో ప్రపంచకప్ గెలుపుపై మాజీ క్రికెటర్లు, ప్రస్తుత ఆటగాళ్లు తమతమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ కూడా టీ-20 ప్రపంచకప్‌పై స్పందించాడు. గ్రూప్ 2లో భాగంగా అక్టోబర్ 24న భారత్, పాక్‌ల మధ్య దుబాయ్ వేదికగా జరిగే మ్యాచ్‌లో కోహ్లి సేనను కచ్చితంగా ఓడిస్తామని బాబర్ ప్రగల్బాలు పలికాడు.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కొత్త ఛైర్మన్ రమీజ్ రాజాతో సమావేశమైన కెప్టెన్ బాబర్ ఆజమ్, ఆ భేటీ తరువాత టీ-20 ప్రపంచకప్ పై స్పందించాడు. టోర్నీ మొదటి మ్యాచ్ లోనే టీం ఇండియాను ఎదుర్కోవడంపై ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు బాబర్ బదులిచ్చాడు. పాక్‌తో పోల్చితే టీమ్ ఇండియా పైనే ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని, దాన్ని అవకాశంగా మలుచుకుని, టీమిండియాపై గెలుస్తామని ధీమా వ్యక్తం చేశాడు.
మరోవైపు టీ-20 ప్రపంచకప్ 2021కు వేదికైన దుబాయ్ తమకు సొంతిల్లు లాంటిదని, అది కూడా తమకు కలిసి వస్తుందని పాకిస్టాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అన్నాడు. ఈ మధ్య కాలంలో టీమ్ ఇండియా రెండు గ్రూపులుగా విడిపోయి సిరీస్‌లు ఆడిన సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లి సారథ్యంలోని ప్రధాన జట్టు ఇంగ్లండ్‌లో టెస్టు సిరీస్ ఆడుతుండగా, శిఖర్ ధవన్ సారధ్యంలోని మరో జట్టు శ్రీలంక పర్యటనలో పరిమిత ఓవర్ల సిరీస్‌లో ఆడింది.
ఇక టీ20 ప్రపంచకప్-2021 గ్రూప్ 1లో వెస్టిండీస్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు ఉండగా, గ్రూప్ 2లో భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ జట్లు ఉన్నాయి. మరి పాక్ కెప్టెన్ బాబర్ వ్యాఖ్యలపై టీమ్ ఇండియా ఎలా స్పందిస్తుందన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.