ఇంటర్నేషనల్ డెస్క్- చారిత్రక వస్తువులు, ప్రముఖులు వాడిన వస్తువులను తరుచూ వేలం వేస్తుండటం మనం చూస్తుంటాం. కొంత మంది సెలబ్రెటీలకు సంబందించిన వస్తువులైతే కోట్ల రూపాయలు వెచ్చించి దక్కించుకుంటారు. తమకు ఇష్టమైన వ్యక్తుల వస్తువులను వ్యామోహంతో ఎక్కువ డబ్బులు వెచ్చించి కొనడం సహజమే.
ప్రముఖుల నవలలు, పుస్తకాలు కూడా అత్యధిక ధరకు అమ్ముడవుతుంటాయి. ఐతే ఓ పుస్తకంలోని కేవలం ఒక పేజీ మాత్రమే కోట్లలో అమ్ముడవడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. 1984 నాటి సింగిల్ స్పైడర్ మ్యాన్ కామిక్ పేజీ వేలంలో ఏకంగా 24 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. స్పైడర్ మ్యాన్ 1962 నాటి ప్రచురణతో కామిక్ పుస్తక చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన సూపర్ హీరోల పాత్రలో ఒకటి.
కామిక్ పుస్తకాల సుప్రసిద్ధ రచయితలైన స్టాన్ లీ, స్టీవ్ డిట్కోచే సృష్టించబడిన ఈ పాత్ర దశాబ్దాలుగా ఇది అందరీ ఇంటి పేరుగా మారిపోయింది. అంతే కాదు చలన చిత్రాలు, వెబ్‌సీరీస్, యానిమేటెడ్ చిత్రాల వరకు ఈ స్పైడరమేన్ పాత్ర విస్తరిస్తూనే ఉంది. గత యేడాది డిసెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో స్పైడర్‌మ్యాన్ నో వే హోమ్ హిట్ అయిన విధానాన్ని బట్టి చూస్తేనే ఆ పాత్రకు ఉన్న ఆదరణ తెలుస్తుంది.
ఇటువంటి సమయంలో 1984 నాటి సింగిల్ స్పైడర్ మ్యాన్ కామిక్ పుస్తకంలోని 25వ పేజీ వేలంలో 24 కోట్ల రూపాయల ధర పలకడంతో ఆ పాత్రకు ఉన్న ప్రజాదారణ మరోసారి స్పష్టమైంది. స్పైడర్ మ్యాన్ పాత్రకు ఎప్పటికీ తిరుగులేని ఆధరణ ఉంటుందని ఈ వేలం మరోసారి నిరూపించింది