ఇంటర్నేషనల్ డెస్క్- కరోనా.. ఈ భయంకరమైన మహమ్మారిని ప్రపంచానికి పరిచయం చేసిన చైనా వెన్నులో మళ్లి వణుకు మొదలైంది. ఇన్నాళ్లు కరోనా మా దగ్గర పుట్టలేదని బుకాయిస్తూ వస్తున్నా చైనా.. ప్రపంచంలోనే తమది అతి పెద్ద జనాభా కలిగిన దేశమైనా.. కరోనాను పూర్తిగా అంతమొందించామని గొప్పలు చెబుతూ వస్తోంది. గత కొన్ని రోజులుగా కనీసం ఒక్కటంటే ఒక్క కరోనా కేసు కూడా లేదని బింకాలు పోయింది. మరి అందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. చైనాలో కరోనా కేసులు మాత్రం రిపోర్ట్ కావడం లేదని ఆ దేశ మీడియా చెబుతోంది. ఇలాంటి సమయంలో కరోనాకు పుట్టినిల్లైన చైనాలో వైరస్ కొత్త స్ట్రెయిన్ వెలుగుచూసింది. అంతకు ముందు కరోనా స్ట్రెయిన్‌లతో పోలిస్తే ఈ కొత్త స్ట్రెయిన్ మరింత ప్రమాదకరమని తేలడంతో చైనా ఆలోచనలో పడింది.
తమ దేశంలో కరోనా కేసులే లేవని చైనా చెప్పుకుంటున్న ఇటువంటి సమయంలో కరోనా కేసులు నమోదు అవుతుండటంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. చైనాలో ప్రతి రోజూ కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నా, వారంతా విదేశాలకు చెందిన వారు కావడంతో తమ దేశంలో కరోనా లేనేలేదని బుకాయిస్తూ వచ్చింది. ఇప్పుడు కొత్తగా 20 మంది స్థానికులు మళ్లీ కరోనా బారిన పడడంతో చైనాలో కలకలం రేగుతోంది. చైనాలోని గాంజావ్ నగరంలో మొత్తం కోటి 50 లక్షల మంది జనాభా ఉంటుంది. వారం రోజుల్లో ఈ నగరంలో మొత్తం 20 కరోనా కేసులు బయటపడినట్లు అధికారులు తెలిపారు. కొత్తగా కరోనా సోకిన వారిని పరిక్షించగా, ఈ సారి కొత్త వేరియంట్ ను గుర్తించారు. ఈ వేరియంట్ మునుపటి వేరియంట్లకంటే ప్రమాదకరమైనదని చైనా చెబుతోంది.
ఈ కొత్త వేరియంట్ వ్యాప్తి వేగంగా ఉంటుందని అక్కడి వైద్య నిపుణులు అంటున్నారు. దీనికి సంబంధించి చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్‌లో ప్రముఖంగా ఓ కథనం ప్రచురితమైంది. ఇక కరోనా కొత్త వేరియంట్ బయటపడడంతో దీని ప్రబావం మరియు వ్యాప్తిని తెలుసుకునేందుకు చైనా ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. కరోనా కొత్త వేరియంట్ అన్వేషణలో భాగంగా పలు ప్రాంతాల్లో ర్యాండమ్ గా పరీక్షలు నిర్వహిస్తోంది. అనుమానం ఉన్న ప్రాంతాల్లో కరోనా ఆంక్షలు విధిస్తోంది చైనా ప్రభుత్వం. ఇప్పటికే కరోనా ను ప్రపంచానికి అంటించిన చైనా.. ఇప్పుడు కొత్త వేరింట్ తో మళ్లీ ఏం విలయం సృష్టిస్తుందోనని అంతా ఆందోళన చెందుతున్నారు.