కొంతమంది ఉద్యోగులు తమ సరదా కోసం చేసే పనులు వారి జీవితంపై ప్రభావం చూపుతున్నాయి. వినోదం కోసం చేసినా.. వారి ఉద్యోగ జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. అయితే, వారు కూడా ఏం చేయాలో ఏం చేయకూడదో తెలుసుకోవటం లేదు. ఎలాంటి విచక్షణ లేకుండా పిచ్చి పనులు చేసి ఇబ్బందుల్లో పడుతున్నారు. తాజాగా, కొంతమంది మహిళా పోలీసులు ఏకంగా కంట్రోల్ రూములో డ్యాన్స్‌లు చేసి ఇబ్బందుల పాలవుతున్నారు. కంట్రోల్ రూములో ఆట,పాటతో వారు చేసిన పనులకు అధికారులు సీరియస్ అవ్వటంతో కంగుతింటున్నారు. ఈ సంఘటన ఉత్తరాఖండ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. ఇంతకీ సంగతేంటంటే.. ఉత్తరాఖండ్ జిల్లాకు చెందిన ఓ ఆరుగురు మహిళలు పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా మంచి స్నేహితులు.
ఈ నేపథ్యంలోనే కొద్దిరోజుల క్రితం ఈ ఆరుగురు పోలీస్ కంట్రోల్ రూములో డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. ఆడుతూ, పాడుతూ సందడి చేశారు. దాన్నంతా వీడియోలుగా చిత్రీకరించారు. అయితే, ఎలా బయటకు వచ్చిందో తెలీదు కానీ, ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆ వీడియో కాస్తా పోలీస్ ఉన్నత అధికారుల దృష్టికి వెళ్లింది. ఇక, ఈ ఘటనపై అధికారులు సీరియస్ అయ్యారు. అంతర్గత విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఇక, ఈ వీడియోలో సాధారణ దుస్తుల్లో ఉన్న ఆరుగులు మహిళా పోలీసులు డ్యాన్స్ చేయటం మనం చూడొచ్చు. ఆ వీడియో దీపావళి సందర్భంగా తీసినదిగా తెలుస్తోంది.