పీత కష్టాలు పీతవి, కోడి కష్టాలు కోడివి అన్న సామెత ఈమెకు సరిపోతుంది. తనకు వచ్చిన కష్టం గురించి చెప్పుకునేందుకు కోడితో సహా పోలీస్ మెట్టెక్కిందీ ఓ మహిళ. అయితే ఆమె చెప్పినది విన్న పోలీసులు.. ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఇంతకూ ఆమె కోడితో పాటు పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సిన అవసరం ఏంటంటే..?
ఇటీవల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్న పలు ఘటనలు వింతగానూ, విడ్డూరంగాను అనిపించకమానదు. చిన్న చిన్న వాటికే కొంత మంది పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతున్నారు. సీరియస్‌గా పోలీస్ స్టేషన్‌కు వెళుతున్న బాధితులు.. వారు చెప్పేది విని పోలీసులు షాక్ అవ్వడంతో పాటు ఒక్కోసారి వారికి నవ్వులు తెప్పిస్తున్నాయి. కొన్ని సార్లు తలనొప్పులుగా మారుతున్నాయి. అటువంటిదే ఈ సమస్య కూడా. ఒకామె కోడిని తీసుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. కోడితో రావడంతో ఆశ్చర్యానికి గురైన పోలీసులు.. ఆమె తన సమస్యను చెప్పేసరికి అవాక్కవ్వడం వారి వంతైంది. ఇంతకూ ఆ వింత ఘటన ఎక్కడ చోటుచేసుకుందంటే.. చత్తీస్ గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో.
రతన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిల్దాహా గ్రామానికి చెందిన జాంకీబాయి బింజ్వార్ అనే మహిళ దేశవాళీ కోళ్లను పెంచుతుంది. అందులోని ఓ కోడిని తీసుకుని మహిళ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. కోడితో రావడాన్ని చూసిన పోలీసులు ఏం జరిగిందని ఆమెను అడిగారు. ‘ నా కోడిని పక్కింటి మహిళ చంపాలని చూసింది.. దీనికి స్వల్ప గాయమైంది. వెంటనే ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ’ పోలీసులను కోరింది. మహిళ ఫిర్యాదుతో ఆశ్చర్యపోయిన పోలీసులు, ఆమె నుండి వివరాలు తెలుసుకొనేందుకు ప్రయత్నించారు. కానీ, మహిళ మాత్రం ముందు కేసు నమోదు చేయాల్సిందేనంటూ పట్టుబట్టారు. పోలీసులు ఏం జరిగిందో చెబితే కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి వీలు లేదని చెబితే, అప్పుడు ఆ మహిళ గొల్లుమంటూ అసలు విషయాన్ని తెలిపింది.
తాను నాటు కోళ్లను పెంచుతానని, అవి ఇంటి చుట్టూ పక్కల మేతకు వెళ్లి వస్తుంటాయని బింజ్వార్ తెలిపింది. అయితే తన కోళ్లలో ఓ దానిపై కన్నువేసిన పక్కింటి మహిళ.. దాన్నిచంపాలని చూసిందని, కోడిని పట్టుకుని కోసే ప్రయత్నంలో తాను చూసినట్లు తెలిపింది. దీంతో కోడిని ఆమె వదిలేసిందని చెప్పింది. ఈ క్రమంలో తన కోడికి గాయాలయ్యాయని చెప్పుకొచ్చింది. తన కోడిని ఉద్దేశపూర్వకంగా చంపేందుకు యత్నించిన మహిళపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ సదరు మహిళ పోలీసులను డిమాండ్ చేసింది. పోలీసులు ఎంత చెప్పినప్పటికీ మహిళ వినకపోవటంతో ఆమె భర్తను స్టేషన్‌కు పిలిపించారు.
భర్త సైతం భార్యకు మద్దతుగా నిలుస్తూ సదరు మహిళలపై కేసు పెట్టాలని చెప్పాడు. గతంలోనూ పక్కింటీ వారు ఇలానే కోడిని చంపబోయారని, నిలదీసి అడిగితే మిమ్మల్ని చంపేస్తామంటూ బెదిరించారని ఇద్దరు చెప్పుకొచ్చారు. పోలీసులు చేసేదేమీ లేక కోడిని చంపేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు మహిళను పిలిపించారు. మహిళ ఈ ఆరోపణలు ఖండించింది. దీంతో ఇరువురి మధ్య సయోధ్య కుదిర్చి ఇంటికి పంపారు పోలీసులు. ప్రస్తుతం ఈ వార్త స్థానికంగా వైరల్ గా మారింది. కోడిపై హత్య యత్నం జరిగిందంటూ పోలీస్ స్టేషన్ మెట్టెక్కిన ఈ మహిళ వేదన పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.