కర్ణాటక రాజకీయం.. సస్పెన్స్ సినిమాని తలపిస్తోంది. బీజేపీ అధికారంలో ఉన్న ఈ రాష్ట్రంలో గత రెండేళ్లగా రాజకీయ అనిశ్చితి కొనసాగుతూనే వస్తోంది. ఇక ఎట్టకేలకు ఇప్పుడు యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో.., కర్ణాటక రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఎవరన్న చర్చ జోరుగా నడుస్తోంది. ఈ విషయంలో ఆశావాదులు ఎక్కువగా ఉండటమే ఇప్పుడు కమలనాధులను కలవర పెడుతోంది.
ప్రస్తుతం కర్ణాటక హోం మంత్రిగా పని చేస్తున్న బసవరాజ్ బొమ్మై ఈ లిస్ట్ లో అందరి కన్నాముందున్నారు. కర్ణాటక రాష్ట్ర మాజీ సీఎం ఎస్ఆర్ బొమ్మై కొడుకే.. ఈ బసవరాజు బొమ్మై కావడం గమనార్హం. ఇక ఇతనికి యడ్యూరప్ప సపోర్ట్ కూడా ఉండటం కలసి వచ్చే అంశం. ఇక కర్ణాటక గనుల శాఖా మంత్రి మురుగేశ్ నిరాణి, ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడ్ పేర్లు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీరంతా లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన వారే కావటం వల్లనే రేసులోకి రాగలిగారు. కర్ణాటక ఓటు బ్యాంకులో ఎక్కువ భాగం ఈ సామాజిక వర్గానిదే. కాబట్టి.. అధిష్టానం వీరి విషయంలో కూడా తప్పక ఆలోచన చేయొచ్చు.
ఒకవేళ వీరు కూడా కాకుంటే.., ఒక్కళిగ సామజిక వర్గం నేత, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి.. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి అశ్వత్ నారాయణ్.. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీ.. రాష్ట్ర చీప్ విప్ సునీల్ కుమార్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మరి.. రానున్న రెండేళ్లలో ఇక్కడ సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఎవరిని అధినాయడుకుడిని చేస్తుందో చూడాలి.