ప్రపంచం సాంకేతిక రంగంలో ఎన్నో విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తుంది. చనిపోయిన మనిషిని బతికించడం తప్ప వైద్యశాస్త్రంలో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు. అయినా కూడా మన దేశంలో మూఢ నమ్మకాల జాఢ్యం కొనసాగుతూనే ఉంది. క్షుద్రపూజల పేరుతో జనాలను ఇంకా మోసం చేస్తూనే ఉన్నారు. కొంత మంది దొంగబాబాలు, స్వామీజీలు మనుషుల బలహీనతను క్యాష్ చేసుకుంటున్నారు. దీర్ఘరోగాలను నయం చేస్తామని.. ఆకస్మిక ధనలాభం కలిగేలా చేస్తామని.. ఇంట్లో దుష్ఠశక్తి దాగి ఉంది తరిమికొడతామని ఎన్నో రకాలుగా దొంగస్వామీజీలు చెప్పడం ప్రజలు నమ్మి వారు అడిగినంత డబ్బు ఇవ్వడం.. తీరా అది మోసమని తెలిశాక లబో దిబో అనడం సర్వసాధారణం అయ్యింది.
ఓ మహిళకు పాము కాటు వేయడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకు వచ్చారు.. ట్విస్ట్ ఏంటంటే అక్కడ డాక్టర్ కి బదులు తాంత్రికుడు వచ్చి చెవిలో గట్టిగా గాలి ఊది.. ఏదో మంత్రం చెప్పాడు. ఈ చోద్యం చూసిన బాధితురాలి బంధువులు షాక్ తిన్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఉత్తర్ ప్రదేశ్ మహుబా జిల్లా లో ఓ మహిళకు పాము కాటు వేసింది. వెంటనే అక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లింది. ఆమెను వెంటనే వైద్య సిబ్బంది ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. విచిత్రం ఏంటంటే అక్కడ డాక్టర్ కి బదులు ఓ తాంత్రికుడు వచ్చి ఆ మహిళ చేతికి కట్టు కట్టి చెవిలో ఏదో మంత్రి ఊదాడు. పాము కాటుతో ఏం జరుగుతుందో అని హైరానా పడుతున్న మహిళ కుటుంబ సభ్యులు తాంత్రికుడు చేసింది చూసి ఆశ్చర్యపోయారు. సాధారణంగా జిల్లా ఆసుపత్రికి పాములు, తేళ్లు కుట్టిన వారికి ఈ తాంత్రికుడే నాటు వైద్యం చేసి బాగు చేస్తుంటారని స్థానికులు అంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ వీడియో చూసి అందరూ ఆసుపత్రిలో డాక్టర్లు ఉండాలి.. తాంత్రికులు ఉండటం ఏంటీ? మరి డాక్టర్లకు ఎందుకు జీతాలు ఇస్తున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ కాలంలో కూడా అదీ ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో తాంత్రికుడు దర్జాగా వచ్చి వైద్యం చేయడం చూస్తుంటే ఇక్కడ సిబ్బంది నిర్లక్ష్యం ఏంటో తెలుస్తుందని.. ఆరోగ్యశాఖ అధికారుల ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.