వెయ్యి మందిని చంపితే వీరుడు అంటారు. కానీ ఒక్కరిని కాపాడినా దేవుడు అంటారు. అలాంటిది ఇతను వెయ్యి మందిని కాపాడాడు. ది రియల్ హీరో అజిత్ సింగ్. 18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు వేశ్యకి పుట్టిన బిడ్డను దత్తత తీసుకున్నాడు. అదే 18 ఏళ్ల కుర్రాడు ఇప్పుడు వెయ్యి మంది అమ్మాయిలని వేశ్య గృహాల భారిన పడకుండా కాపాడిన వీరుడిగా నిలిచాడు. చైల్డ్ ట్రాఫికింగ్, ఉమెన్ ట్రాఫికింగ్ వినే ఉంటారు. ఈ కాన్సెప్ట్ మీద చాలా సినిమాలు వచ్చాయి. సినిమాలో కాబట్టి హీరో చితక్కొట్టి వాళ్ళని కాపాడేస్తాడు. కానీ నిజ జీవితంలో అలా కాదుగా. చట్టాలు, పోలీసులు ఒక వ్యవస్థ ఉంది. ఈ వ్యవస్థని అనుసరించే నడుచుకోవాలి.
సామాజిక నిబంధనలు పాటించాలి. చట్టాన్ని దృష్టిలో పెట్టుకునే నడవాలి. సినిమాల్లో హీరోలా కత్తులు, తుపాకులు పుచ్చుకుని వెళ్తే అది సరైన మార్గం కాదు. కానీ వారణాసిలో గత కొన్నేళ్లుగా జరుగుతున్న, ఇక్కడ ఇదంతా మామూలే అని లైట్ తీసుకునేలా.. ఎవరూ ఏమీ చేయలేనంతగా ఒక మాఫియాలా మారి మైనర్ బాలికలని అక్రమ రవాణా చేస్తున్న ముఠా నేరాలని ఎదిరించిన మొనగాడు, మగాడు, వీరుడి కథ ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. 1400 మంది ట్రాఫికర్స్ నుంచి 1000 మందికి పైగా మైనర్ అమ్మాయిలని కాపాడడమే గాక.. ఆ తప్పుడు వెధవల మీద తిరిగి కేసులు పెట్టి.. వాళ్ళని కటకటాలకి నెట్టాడు.
వారణాసి అంటే పవిత్రమైన పుణ్యక్షేత్రం. అయితే అక్కడ ఈ రియల్ హీరో రానంత వరకూ ట్రాఫికింగ్ అనేది చాలా కామన్. అమ్మాయిలని అక్రమ రవాణా చేసి వేశ్య గృహాలకు తరలిస్తారు. అయితే అజిత్ సింగ్ ఈ బ్రోకర్ల పని పట్టాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీళ్ళతో ఫైట్ చేయడం అంత సులువు కాదని తెలుసు. కానీ వేలాది మంది గ్రామస్తులని పోగుజేసి.. వాళ్లకి సమస్య గురించి చెప్పి.. 50 మంది మైనర్ బాలికలను కాపాడాడు. ఇతనికి గురియా అనే ఆర్గనైజేషన్ ఉంది. ఈ ఆర్గనైజేషన్ చైల్డ్ ట్రాఫికర్స్ కి వ్యతిరేకంగా కోర్టులో వేసిన 200 కేసుల్లో వారితో ఫైట్ చేసింది. ఈరోజు వారణాసిలోని రెడ్ లైట్ ఏరియా శివదాస్పూర్ విభిన్నంగా కనబడుతోందంతే దానికి కారణం ఈ అజిత్ సింగ్ నే.
అజిత్ సింగ్ 18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు.. 1988లో తన స్వస్థలం అయిన వారణాసిలో ఒక పెళ్ళికి వెళ్ళాడు. అక్కడ పెళ్ళిలో ఒక అమ్మాయి డ్యాన్స్ వేయడం చూశాడు. ఒక వేశ్య కూతురు. పెళ్లిళ్లలో వేశ్యలతో డ్యాన్స్ చేయించేవారు. అలా వేశ్య కూతురు అయిన ఒక అమ్మాయితో డ్యాన్స్ చేయించారు. డ్యాన్స్ చూస్తున్న ప్రేక్షకులు అమ్మాయిపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఆ నర్తకిని వాళ్ళు చూసే విధానం, ప్రవర్తించే తీరు చూసి అజిత్ సింగ్ కి అసహ్యం వేసింది. ఈ అమ్మాయి జీవితం అజిత్ ని బాగా కుదిపేసింది. అతని మనసుని కలచివేసింది. ఎలాగైనా ఇలాంటి అమ్మాయిలను ఈ చీకటి పంజరం నుంచి ఎగిరేలా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఒక్క అమ్మాయి నుంచే అజిత్ సింగ్ యొక్క నిస్వార్థ సేవ మొదలై.. కొన్ని దశాబ్దాల పాటు కొనసాగింది. ఇంకా కొనసాగుతోంది. ఆ అమ్మాయి ప్రదర్శన అయిపోయాక.. అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటామని ఆ అమ్మాయి తల్లిని ఒప్పించి తీసుకెళ్లాడు. మెరుగైన జీవితాన్ని అందిస్తానని చెప్పి తీసుకెళ్లాడు.
18 ఏళ్ళకి దత్తత తీసుకోవడం అంటే కష్టమే. కానీ రెండోసారి ఆలోచించలేదు. కుటుంబాన్ని ఒప్పించడానికి కష్టపడ్డాడు. మొదట ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. ఇది నేను చేయవలసిన యజ్ఞం అని వాళ్ళకి చెప్పాడు. బీదవారి పిల్లలకి ఖాళీ సమయంలో చదువు చెప్పేవాడు. జీవితంలో ఉన్నత లక్ష్యాలను అధిగమించేలా పిల్లలకి దిశా నిర్దేశం చేసేవాడు. వేశ్య గృహాల్లో ఉండే చీకటి బతుకుల కంటే చదువుకుని గొప్ప స్థాయిలో నిలబడితే వచ్చే ప్రకాశవంతమైన జీవితం ఎంతో ఉన్నతంగా ఉంటుందని వాళ్ళని ఇన్స్పిర చేశాడు. ఇలా పిల్లల్ని ఇన్స్పైర్ చేస్తూ.. తరచూ వారణాసిలో ఉన్న రెడ్ లైట్ ఏరియాలకు వెళ్ళేవాడు. అలా వెళ్ళినప్పుడు అతనికి పిల్లల్ని కాపాడడం చాలా కష్టంతో కూడుకున్న పని అని అర్థమైంది. ఎందుకంటే ఒకరో, ఇద్దరో అయితే అనుకోవచ్చు. కానీ వందల, వేల మంది పిల్లలు ఉన్నారు. ఇదొక వృత్తిలా సాగుతుంది. మూలాల నుంచి దీన్ని పెకిలించాలి అనుకున్నాడు.
పిల్లలకి చదువు గురించి, వారి ఆరోగ్యం గురించి, ఎయిడ్స్ మీద అవగాహన కల్పించడం ఇవేమీ ఈ సమస్యకి పరిష్కారం కాదని తెలుసుకున్నాడు. ఎంతమందిని అని ఎడ్యుకేట్ చేయాలి. అసలు వేర్లని పెకిలిస్తే సరిపోద్ది కదా అని అనుకున్నాడు. అప్పుడు ఫిక్స్ అయ్యాడు, సమస్య లైంగిక బానిసత్వంలో ఉంది. సెక్స్ ట్రాఫికింగ్ సిస్టమ్ నే పూర్తిగా నాశనం చేయాలి అని అనుకున్నాడు. అప్పుడు మాత్రమే ఈ ఆడపిల్లలు రక్షించబడతారని అనుకున్నాడు. ఇంకా ఎక్కువ మంది అమ్మాయిలని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీని కోసం 1993లో గురియా అనే ఆర్గనైజేషన్ ని స్థాపించాడు. ఇది లైంగిక దోపిడీకి వ్యతిరేకంగా.. ముఖ్యంగా మైనర్ బాలికలపై జరుగుతున్న లైంగిక దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతుంది. నిస్సహాయ స్థితిలో ఈ వృత్తిలోకి దిగిన వారిని బయటకు రప్పించి.. వారికి ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉందని ఆలోచించాడు. ఈ రాకెట్ గొలుసుని తెంపాలని ఫిక్స్ అయ్యాడు.
పెన్, షర్ట్ బటన్, వాచ్ వంటి వస్తువుల్లో హిడెన్ కెమెరాలు పెట్టుకుని.. వేశ్య గృహాలకు వెళ్ళేవాడు. ఒక కస్టమర్ లా అమ్మాయి కావాలని తిరిగేవాడు. రెడ్ లైట్ ఏరియాల్లో ఉన్న ప్రతీ వేశ్య గృహంలోనూ ఉన్న అమ్మాయిలని, లొకేషన్స్ ని అన్నిటినీ ట్రాక్ చేసేవాడు. మొత్తం ఎంతమంది ఉన్నారు అని పూర్తిగా తెలుసుకున్న తర్వాత.. ఎదిరించడానికి కావాల్సిన ఫోర్స్ ని వాలంటీర్ల రూపంలో వందలాది జనాన్ని పోగుచేసి వేశ్య గృహాలపై దాడి చేయడం మొదలుపెట్టాడు. అలా మొదటిరోజు వారణాసిలో ఉన్న ఫేమస్ రెడ్ లైట్ ఏరియాలో ఉన్న వేశ్య గృహంపై దాడి చేసి 15 మంది అమ్మాయిలని రక్షించాడు. అప్పటి నుంచి మొదలు అనేక దాడులు చేస్తూ.. 1000 మందికి పైగా బాలికలను రక్షించాడు. ఆ తర్వాత వారిని ప్రభుత్వ షెల్టర్ హోమ్స్ కి తరలించాడు.
ఈ బాలికలకు కౌన్సిలింగ్ ఇచ్చి.. వాళ్ళని తిరిగి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి పంపించేవారు. అయితే పిల్లల్ని కాపాడేశామని తమ పని పూర్తయ్యిందని అజిత్ అనుకోలేదు. తమ ఆర్గనేజేషన్ లో పని చేసే సామాజిక కార్యకర్తలు ఈ బాలికల కదలికలను అనుక్షణం గమనిస్తూ ఉంటారు. మరలా ఆ వృత్తిలోకి వెళ్లకుండా.. బలవంతంగా వృత్తిలోకి దింపాలని చూసినా ఆ పిల్లల్ని వెళ్లకుండా ఆపుతారు. వారణాసిలో నో మోర్ చైల్డ్ ప్రాస్టిట్యూషన్ అని అజిత్ గర్వంగా చెప్పుకుంటాడు. ఈ సెక్స్ రాకెట్ లో కీలక పాత్ర ఈ మొత్తం రాకెట్ ని కంట్రోల్ చేసే వ్యక్తిది, కస్టమర్లకు అమ్మాయిలను సరఫరా చేసే వ్యక్తులది, బ్రోకర్లది. అతడు సినిమాలో మహేష్ బాబులా.. మీరు చేస్తుంది చాలా తప్పు అని అంటే వాళ్ళు అర్థం చేసుకోరు. పోనీ పోలీస్ బ్రో నువ్వైనా ఆలోచించు అంటే.. ఈ విషయంలో మేము ఏమీ చేయలేమని చేతులెత్తేస్తారు. అందుకే ఈ సమస్యని వెలుగులోకి తీసుకురావాలని అనుకున్నాడు.
గురియా ఆర్గనైజేషన్ ద్వారా ట్రాఫికర్స్ మీద 1400 కేసులు పెట్టారు. వాళ్ళకి శిక్ష పడేలా చేశారు. అంతేకాదు వారికి జీవితంలో బెయిల్ రాకుండా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వాళ్లకి బెయిల్ కూడా రాకూడదని.. దీనికి అడ్డుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తుంది. గురియా ఆర్గనైజేషన్ లీగల్ గా జోక్యం చేసుకోవడం వల్ల 400 మంది దుర్మార్గుల బెయిల్స్ కూడా రద్దు అయ్యాయి. బెయిల్ మీద బయటకొస్తే మళ్ళీ అమ్మాయిలతో వ్యాపారం మొదలుపెడతారు ఈ దుర్మార్గులు. అందుకే ఈ అజిత్ ఇలా చేశాడు. ఒక వేశ్య కూతుర్ని పెళ్ళిలో చూడడం, దత్తత తీసుకోవడం ఒక ఎత్తు అయితే.. ఇంకా ఇలాంటి ఆడ పిల్లల్ని కాపాడాలి అనుకోవడం మరొక ఎత్తు. వాళ్ళని కాపాడి ఊరుకున్నాడా.. నేరాలకు పాల్పడిన దుర్మార్గులను జైలుకి పంపించాడు. అక్కడితో ఆగాడా.. మళ్ళీ ఈ వెధవలు బయటకొస్తే మళ్ళీ మొదటికి వస్తుందని అసలు బెయిలే రాకుండా ప్రయత్నం చేస్తున్నాడు. ఇలా ఎన్ని దారులు ఉంటే అన్ని దారులూ మూసేసి.. దుర్మార్గులను చాప్టర్ క్లోజ్ చేసేసాడు. అందుకే అజిత్ సింగ్ ని రియల్ హీరో అన్నారు. మరి వెయ్యికి పైగా అమ్మాయిలని రక్షించిన ఈ రియల్ హీరోపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి. ఊరికొక అజిత్ సింగ్ ఉంటే.. దేశం ఎక్కడికో వెళ్ళిపోతుంది.