భారతదేశం వ్యవసాయాధారిత దేశం. ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తుంటారు. నష్టం వచ్చినా ఎంత కష్టమైనా రైతులు వ్యవసాయం చేయడం మాత్రం మానుకోరు. భారతదేశానికి రైతు వెన్నెముక లాంటి వాడు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని పంటలు పండించి దేశ ప్రజల ఆకలిని తీరుస్తున్నారు.
మారుతున్న వాతావరణ పరిస్థితులు, పంటల్లో వస్తున్న వివిధ రకాల ఛీడపీడలతో పంట దిగుబడి తగ్గి రైతు కు నష్టం వాటిల్లుతుంది. దీంతో ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తున్న అన్నదాతకు ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నాయి. పంటలకు మద్దతు ధరలు నిర్ణయించి రైతులు నష్టపోకుండా చేస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్రం రైతులకు శుభవార్త తెలియజేసింది.
వాతావరణ మార్పులతో, అకాల వర్షాలతో, పంటల్లో వచ్చే వివిద వ్యాధులతో రైతులు పండించే పంటలకు తీవ్ర నష్టం వస్తుంది. దీనికి తోడు పండించిన పంటకు సరియగు ధర రాక అన్నదాతలు తీవ్రంగా నష్ట పోతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించింది. దీంతో దళారీ వ్యాపారులతో చేతుల్లో మోసపోతున్న రైతులకు ఇది ఊరటనిచ్చే అంశమని చెప్పాలి. ఎంఎస్ పి అనేది ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసే ధరను సూచిస్తుంది. మార్కెట్ లో చోటుచేసుకునే అనూహ్య మార్పులు, ధరల్లో తేడాలు వచ్చినపుడు ఈ ఎంఎస్ పి అనేది రక్షిస్తుంది. అయితే తాజాగా కేంద్రం పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ మద్దతు ధరలకు సంబందించిన విషయాలను వెళ్లడించారు. సాధారణ వరి రకానికి క్వింటాల్ కు రూ. 143 పెంచింది. దీంతో వరి క్వింటాల్ ధర రూ. 2,183 కు చేరింది. గ్రేడ్ ఎ రకానికి రూ. 163 పెంచడంతో రూ. 2,203 కు చేరింది. అదేవిధంగా పెసర పంటకు 10.4 శాతం పెంచడంతో క్వింటాల్ కు రూ. 8,558 కు ధర చేరింది. వేరుశనగకు కనీస మద్దుతు ధర 9 శాతం పెంచింది. హైబ్రిడ్ జొన్న క్వింటాల్ రూ.3,180, జొన్న రూ.3,225, రాగి రూ.3,846, సజ్జలు రూ.2500, మొక్కజొన్న రూ.2,090, పత్తి మధ్యస్థాయి పింజ రూ.6,620, పత్తి పొడవు పింజ రూ.7,020 చొప్పున కనీస మద్దతు ధర ప్రకటించింది. ఖరీఫ్ పంటలకే ఈ కనీస మద్దతు ధర వర్తించనుంది.