అకాల వర్షాల కారణంగా.. రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. చేతికొచ్చిన పంట.. చేలోనే తడిసి.. వాన నీటిలో కొట్టుకుపోతుంది. ఏం చేయాలో పాలుపోని స్థితిలో రైతన్నలు ఉన్నారు. ఈ క్రమంలో అన్నదాతలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆ వివరాలు..
2022-23లో ప్రకృతి తన పంథా మార్చుకుందేమో అనే అనుమానాలు వస్తున్నాయి. సీజన్‌తో సంబంధం లేకుండా.. అన్ని కాలాల్లో వర్షాలు కురుస్తున్నాయి. శీతా కాలంలో, వేసవి కాలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వానలు పడుతున్నాయి. మండుటెండలో.. భారీ వర్షాలు కురవడంతో వాతావరణం చల్ల బడింది. దాంతో నగరాల్లో ఉంటున్న వారు ఊపిరి పీల్చుకుంటుంటే.. అన్నదాతలు మాత్రం.. కంటికిమింటికి ఏకధాటిగా ఏడుస్తున్నారు. పాలకులకు మా మీద దయ లేదు.. ప్రకృతికి కూడా మాపై జాలి లేదా.. మరి కొన్ని రోజుల్లో పంట చేతికి వస్తుందనగా ఈ అకాల వర్షాలేంటి అంటూ గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. ఆరుగాలం కంటికి రెప్పలా కాపాడుకున్న పంట.. ఇంటికి చేరకముందే.. చేలోనే వాన నీటిలో తడిసి.. కొట్టుకుపోతేంటే.. దాన్ని కాపాడుకోలేక.. ఏం చేయాలో అర్థం కాక.. తన గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక అన్నదాత గుండెకోత వర్ణనాతీతంగా ఉంది. ఇక అకాల వర్షాలతో ఆగమవుతోన్న అన్నదాతలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు.
అకాల వర్షాల కారణంగా పంట తడిసిపోయిందని రైతులెవ్వరూ ఆందోళన చెందొద్దని కేసీఆర్ ధైర్యం చెప్పారు. రైతులు పండించిన ప్రతీ గింజ కొంటామని ఆయన హామీ ఇచ్చారు. అంతేకాక.. తడిసిన ధాన్యానికి కూడా ప్రభుత్వం మద్దతు ధరనే చెల్లిస్తుందని ప్రకటించారు. వ్యవసాయాన్ని కాపాడుకుంటూ.. అన్నదాతల కష్టాల్లో భాగస్వామ్యమవ్వటమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా కేసీఆర్ ప్రకటించారు. మరికొన్ని రోజుల పాటు అకాల వర్షాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో.. రైతులు.. మరో మూడు నాలుగు రోజుల పాటు వరి కోతలను వాయిదా వేసుకోవాలని కేసీఆర్ సూచించారు.
కొత్త సచివాలయంలో రెండో రోజున ధాన్యం కొనుగోళ్లపై, అకాల వర్షాల నేపథ్యంలో తడిసిన ధాన్యం సేకరణ, యాసంగి వరి ముందస్తుగా కోతలకు వచ్చేలా చర్యలు, అనుసరించాల్సిన కార్యాచరణ తదితర అంశాలపై కేసీఆర్ వయవసాయ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వడగళ్ల వానలకు పంట నష్టపోయిన రైతులకు.. ఎకరానికి 10 వేల రూపాయల చొప్పున పరిహారం ఇచ్చి ప్రభుత్వం ఆదుకుంటుందని కేసీఆర్ తెలిపారు. ఏటా మార్చి నెలాఖరు వరకు యాసంగి కోతలు పూర్తయ్యేలా రైతాంగం వరిని ముందుగానే నాటుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. శాస్త్రీయ అధ్యయనం చేసి రైతాంగాన్ని చైతన్యపర్చాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు కేసీఆర్.
ప్రకృతి వైపరీత్యాలతో పాటు మారుతున్న కాలానికి అనుగుణంగా తలెత్తే మార్పులను ఎప్పటికప్పుడు అన్నదాతలకు అర్థమయ్యే విధంగా కరపత్రాలు, పోస్టర్లు, ప్రకటనల ద్వారా తెలియపరిచి.. వారిని చైతన్య పర్చాలని వ్యవసాయ అధికారులకు సూచించారు కేసీఆర్. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన రైతు వేదికలను వినియోగించుకుంటూ వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని కేసీఆర్ ఆదేశించారు. వ్యవసాయాధికారులు అలసత్వం వహిస్తే కఠిన చర్యలుంటాయని కేసీఆర్ హెచ్చరించారు. మరి తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.