నేడు సమాజం సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందింది. చాలా మంది టెక్నాలజీని అందిపుచ్చుకుని ప్రపంచంలోని ప్రతి విషయాన్ని తెలుసుకుంటున్నారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మనిషి.. తనకు తెలియని ఎన్నో విషయాలను కనిపెడుతున్నాడు. ఎన్నో అంతుచిక్కని రహస్యాలను సైతం చేధిస్తున్నాడు. ఇంతలా విజ్ఞానంతో దూసుకెళ్తున్న ఈ సమాజంలో ఇంకా కొందరు మూఢనమ్మకాలను వదలటం లేదు. మరీ దారుణం ఏమిటంటే మూఢనమ్మకాలను విశ్వసించ వద్దని విద్యార్ధులకు చెప్పాల్సిన గురువులే.. వాటిని బలంగా నమ్ముతున్నారు. వారు నమ్మడమే కాక ఆ విశ్వాసాలను పిల్లల్లోనూ నూరిపోస్తున్నారు. అలాంటి ఘటనే ఒకటి తాజాగా చోటుచేసుకుంది. పాఠశాలలో దెయ్యాలు, ఆత్మలు తిరుగుతున్నాయంటూ గురువులు పిల్లలకు నూరిపోశారు. అంతేకాక ఓ తాంత్రికుడిని తీసుకొచ్చి ఉపశమనం చేయించారు. ఉత్తర్ ప్రదేశ్ లోని మహోబా జిల్లాలోని ఓ పాఠశాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం మహోబా జిల్లా లోని కన్య ప్రాథమిక పాఠశాలలోని పెద్ద సంఖ్యలు పిల్లలు విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. సోమవారం ఈ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేశాక.. 15 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. అయితే పాఠశాల ఉపాధ్యాయులు వెంటనే ఆ పిల్లలను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. దీంతో పిల్లలకు ప్రాణాపాయం తప్పింది. ఆ తరువాత స్కూల్ కి వచ్చిన టీచర్లు.. బాలికలకు ఆత్మలు ఆవహించాయని భావించారు. అంతటితో ఆగక ఆ స్కూల్ యాజమాన్యం మాంత్రికుడిని పిలిపించింది. పిల్లల అనారోగ్యానికి గురి కావడానికి పాఠశాలలో ఉండే దెయ్యమే కారణమని తాంత్రికుడితో ఉపశయనం చేయించారు. అయితే అనారోగ్యానికి గురైన బాలికల వయస్సు 9 నుంచి 13 ఏళ్ల మధ్య ఉంటుంది. అనారోగ్యానికి గురైన పిల్లలకు కూడా మాంత్రికుడితో ఉపశమనం చేయించినట్లు సమాచారం.
అలానే స్థానికులు ఈఘటనపై అధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని జిల్లా సబ్ డివిజనల్ కలెక్టర్ అరుణ్ దీక్షిత్ తెలిపారు. మధ్యాహ్న భోజనం నమూనాలను పరీక్షల నిమిత్తం పంపినట్లు ఆయన వెల్లడించారు. రిపోర్ట్ వచ్చిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఇలా మూఢనమ్మకాల కారణంగా అనేక మంది అమాయకులు బలవుతున్నారు. ఒకవైపు విజ్ఞానం విరాజిల్లుతుంటే… మరోవైపు ఇంకా దెయ్యాలు, భూతలు అంటూ కొందరు మూఢనమ్మకాలను బలంగా నమ్ముతున్నారు. వీరి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు అందినకాడికి డబ్బులు దండుకుంటున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.