తమ కోరికలు నెరవేర్చాలని భక్తులు దేవుడి దగ్గరకు వెళుతుంటారు. మొక్కులు మొక్కి, ముడుపులు కట్టి , కొబ్బరికాయలు కొట్టి, ప్రసాదం పెట్టి పూజలు చేస్తుంటారు. దేవుడ్ని మరింత ప్రసన్నం చేసుకునేందుకు పొర్లు దండాలు, నాలుకపై శూలాలు, అరచేతిలో కర్పూరం వెలిగించుకోవడం వంటి చర్యలు చేస్తారు. అంతేకాకుండా దేవుడు కలలో కనిపించి ఇది చేయమన్నాడని అది చేయమన్నాడని చెబుతూ.. ఎటువంటి పనులనైనా చేసేస్తాం. ఇవన్నీ మన కోరికలు నెరవేర్చేందుకే. దేవుడిపై భక్తి, విశ్వాసం ఉండొచ్చు కానీ మూఢ విశ్వాసం ఉండకూడదు. ఈ భక్తుడైతే ఏకంగా దేవుడు చెప్పాడని సంసార జీవితానికే ఫుల్ స్టాఫ్ పెట్టొద్దామనుకున్నాడు.
ఈ వింత ఘటన కర్ణాటకలోని తమకూరు జిల్లాలో జరిగింది. చిక్కనాయకనహళ్లి తాలూకా హందనకెరెకు చెందిన మంజునాథ్, పార్వతమ్మలకు ఐదారేళ్ల క్రితం వివాహమైంది. వీరి సంసారం కూడా చక్కగా సాగిపోతుంది. అయితే తనకు దేవుడు కనిపించి.. భార్యకు విడాకులివ్వమన్నాడని కోర్టు మెట్టెక్కాడు మంజునాథ్. చిక్కనాయకనహళ్లి కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. విడాకుల కేసుపై సీనియర్ సివిల్ జడ్జి వెంకేటశప్ప వాదనలు విన్నారు. విడాకులు ఎందుకు కావాలని అడిగితే.. దేవుడు చెప్పాడని అనడంతో జడ్జితో సహా కోర్టులో ఉన్నవారంతా విస్తుపోయారు.
వీరిద్దరికీ గొడవలు లేవని, కలిసి జీవించడం ఇష్టమే కానీ, దేవుడి చెప్పడంతో విడాకులకు మంజునాథ్ దరఖాస్తుకు చేసుకున్నట్లు అతడి తరపు న్యాయవాది చెప్పారు. దీంతో న్యాయమూర్తి చీవాట్లు పెట్టి, భార్యతో కలిసి ఉండాలని సూచించారు. జడ్జి మాటలతో మంజునాథ్ తన భార్యతో కలిసి ఉండేందుకు అంగీకరించడంతో.. మరోసారి వారికి కోర్టులో పెళ్లి చేశారు న్యాయమూర్తి. వీరిద్దరీ చేత దండలు మార్పించి.. కలకాలం సంతోషంగా ఉండాలని ఆశ్వీరదించారు. అనైతిక సంబంధాలు, ఆస్తి, సరిగా కాపురం చేయడం లేదని, వరకట్న వేధింపులు, దాడి చేయడం కారణాలతో విడాకుల కోసం కోర్టుకు వెళ్లడం చూశాం కానీ.. దేవుడి చెప్పాడని కోర్టుకు వెళ్లడం బహుశా ఇదే మొదటిదేమో. దేవుడు చెప్పాడని విడాకుల కోసం కోర్టుకు వెళ్లడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.