సాధారణంగా విమానాలు అప్పుడప్పుడు ఆలస్యంగా నడవడం సహజమే. సాంకేతిక లోపంతోనో, ఫైలట్ రాకనో, వాతావరణం అనుకులంగా లేకనో విమానాలు లేట్ అవుతూ ఉంటాయి. లేదా బాంబు బెదిరింపులు వచ్చినప్పుడు ఫ్లైట్స్ ను రద్దు చేసిన సందర్భాలు సైతం ఉన్నాయి. అయితే ఇద్దరు లవర్స్ చాటింగ్ చేసుకుంటే ఎక్కడైనా విమానం ఆగుతుందా? ఆగదు కదా కానీ కర్ణాటకలోని మంగళూర్ లో ఆగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
ప్రేమికులు అన్నాక ఫోన్స్, చాటింగ్ లు కామన్. అయితే ఇద్దరు ప్రేమికుల చాటింగ్ కారణంగా మంగళూరు నుంచి ముంబై వెళ్లవలసిన విమానం ఆరు గంటలు ఆలస్యంగా బయలు దేరింది. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. లవర్స్ చాటింగ్ ప్రయాణికులతో పాటు సిబ్బందిని కూడ బయపెట్టింది. తాజాగా వెలుగు చూసిన ఈ సంఘటన మంగళూరు విమానాశ్రయంలో ఆదివారం జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విమానంలో ఉన్న ఓ యువకుడు తన లవర్ తో చాటింగ్ చేస్తున్నాడు. అయితే అతడి ప్రేమికురాలు కూడా అదే ఎయిర్ పోర్ట్ నుంచి బెంగళూరు వెళ్లడానికి రడీగా ఉంది. సమయం ఉండటంతో సరదాగా చాటింగ్ చేసుకుంటూ ఉన్నారు. ఇంతలో ఆమె ”యూ ఆర్ ద బాంబర్” అంటూ ఓ మెసేజ్ పంపింది. ఆ మెసేజ్ ను పక్కన ఉన్న వ్యక్తి చూశాడు. ఇక అంతే వెంటనే అతడు బయపడి విషయాన్ని సిబ్బందికి చెప్పాడు.
వెంటనే అప్రమత్తం అయిన భద్రతా సిబ్బంది ప్రయాణికులను కిందికి దించారు. విమానాన్ని పూర్తిగా తనిఖీ చేశారు. ఈక్రమంలోనే ఆ యువకుడిని, ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. చివరకు అతడు బాంబర్ కాదని తెలియడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. ఈ తతంగం అంతా జరగడానికి దాదాపు ఆరు గంటల సమయం పట్టింది. దీంతో మధ్యాహ్నం వెళ్లాల్సిన విమానం సాయంత్రం 5 గంటల తర్వాత బయలు దేరింది. ఇలాంటి చిత్రమైన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.