ఈ ఏడాది మండల పూజల కోసం శబరిమల అయ్యప్ప ఆలయం నవంబరు 15న తెరుచుకోగా.. కోవిడ్ నిబంధనల మధ్యే భక్తులను అనుమతిస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.ఇప్పటికే తుఫాన్ ప్రభావంతో ఆంధ్ర, తమిళనాడులోని పలు ప్రాంతాల్లో విధ్వంసం జరిగింది. కేరళలోను భారీ వర్షాలు కురస్తోన్నాయి. వర్షాల తీవ్రత ఎక్కవగా ఉండటంతో శబరిమల యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ఆలయ అధికారులు ప్రకటించారు.
భారీ వర్షాల వల్ల పంబా సహా ప్రధాన నదుల్లో నీటిమట్టం పెరగుతున్నాయి. దీంతో శబరిమల అయ్యప్ప దర్శనాలను ఒకరోజు నిలిపివేస్తున్నట్టు “పతనంతిట్ట” జిల్లా అధికార యంత్రాంగం ఉత్తర్వులు జారీ చేసింది. పంబా నదిలో వరద నీరు భారీస్థాయిలో ప్రవహిస్తుండటంతో డ్యామ్ పరిసరాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. కక్కి అనాతోడ్ రిజర్వాయరు వద్ద రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు “పతనంతిట్ట” జిల్లా అధికారులు తెలిపారు. యాత్రికుల భద్రత దృష్ట్యా పంబా, శబరిమలలో భక్తుల రాకను నిలిపివేస్తున్నట్టు జిల్లా కలెక్టరు దివ్య ఎస్ అయ్యర్ ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా మహమ్మారి, భారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా యాత్రికుల రాకను క్రమబద్ధీకరించే ప్రయత్నాల్లో భాగంగా గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా భక్తులను వర్చువల్ క్యూ సిస్టమ్ ద్వారా అనుమతిస్తున్నారు.