పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని అంటారు. కొందరు చిన్నతనం నుంచే అద్భుతమైన ట్యాలెంట్ ను కలిగి ఉంటారు. అలా అందరిలోను ఏదో ప్రతిభ తప్పకుండా ఉంటుంది. దాన్ని గుర్తించి, ఆ రంగంలో వారిని ప్రొత్సహిస్తే తప్పకుండా మంచి పేరు సాధిస్తారు. తాజాగా బిహార్ ముజఫర్ కు చెందిన 13 ఏళ్ల బాలుడు 56 కంపెనీలు స్థాపించి ఔరా అనిపిస్తున్నాడు. ప్రపంచంలోనే అతిపిన్న సీఈవోగా మారి రికార్డుకెక్కాడు ఈ బాలమేధావి. వివరాల్లోకి వెళ్తే…
బీహార్ లోని ముజఫర్‌పుర్‌కు చెందిన కట్రా బ్లాకులోని అమ్మ గ్రామానికి చెందిన సూర్యాన్ష్.. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నాడు. చిన్న వయస్సును టెక్నాలజీకి సంబంధించిన విషయాలపై ఆసక్తి చూపించే వాడు. రోజుకు 17-18 గంటలు పనిచేస్తూ.. కొత్త కొత్త కంపెనీలకు జీవం పోస్తున్నాడు. డెలివరీ, మ్యాట్రిమోనీ సేవల నుంచి క్రిప్టోకరెన్సీ వంటి క్లిష్టమైన ఆర్థిక సేవల వరకు అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆన్లైన్ కంపెనీ స్థాపించాలన్న ఆలోచనను తండ్రితో పంచుకున్న సూర్యాన్ష్.. వారి ప్రోత్సాహంతో క్విక్-కామర్స్ కంపెనీని స్థాపించాడు.
క్లాసులకు వెళ్లలేకపోయినా.. పాఠశాల యాజమాన్యం తనకు అన్ని విషయాల్లోనూ మద్దతుగా ఉంటోందని సూర్యాన్ష్ చెబుతున్నాడు. ప్రస్తుతానికైతే ఈ కంపెనీల నుంచి తనకు రాబడి లేదని, అన్నీ సవ్యంగా జరిగితే త్వరలోనే ఆదాయం వస్తుందని చెప్పాడు. భవిష్యత్‌లో కామర్స్ రంగంలో చదువు కొనసాగిస్తానని వివరించాడు. ఇక సూర్యాన్ష్ మాట్లాడుతూ.. “సూర్యవంశ్ కాంటాక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కింద 56కు పైగా నమోదిత స్టార్టప్ కంపెనీలు ఉన్నాయి. ఇంకా కొన్ని రిజిస్టర్ కావాల్సి ఉంది. ‘మంత్రా ఫై’ అనేది క్రిప్టో కరెన్సీ కంపెనీ సంస్థ.. ఆర్థిక వ్యవహారాలపై అవగాహన లేని వారికి కూడా ఇది ఉపయోగపడుతుంది.
జస్ట్ బిజినెస్ అనేది క్విక్ కామర్స్ సంస్థ. ఓలా తరహాలో జిప్సీ క్యాబ్స్, కులాంతర వివాహాల కోసం షాదీ కరో అనే మ్యాట్రిమోని కంపెనీ స్థాపించా. ఇన్ని కంపెనీలు స్థాపించడం పట్ల నాకు చాలా ఆనందంగా ఉంది” అని తెలిపాడు. ప్రస్తుతం ఈ యంగెస్ట్ సీఈవో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. 13 ఏళ్లకే 56 కంపెనీలకు సీఈవో గా మారిన ఈ బాలుడి పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.