2016, నవంబర్ 8 దేశ ప్రజలకు గట్టిగా గుర్తుండిపోయే రోజది. ఇదే రోజున భారత ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో చలామణీలో ఉన్న 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. భారత ప్రధాని నవంబర్ 8న మీడియా ముందుకు వచ్చారు. దేశ ప్రజలను ఉద్ధేశించి మాట్లాడారు. పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దేశంలోని దొంగనోట్లు, నల్లధనాన్ని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానంలో అప్పట్లోనే పలు పిటిషన్‌లు దాఖలయ్యాయి.
ఈ పిటిషన్లపై కోర్టు విచారణ జరిపింది. తుది తీర్పును రిజర్వ్ చేసి ఉంచింది. ఈ నేపథ్యంలోనే సోమవారం సుప్రీం కోర్టు ధర్మాసనం నోట్ల రద్దు అంశంపై తుది తీర్పును వెలువరించింది. ఐదుగురు సభ్యుల సుప్రీం కోర్టు ధర్మాసనం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న 500, 1000 నోట్ల రద్దు సమంజసమే అని పేర్కొంది. న్యాయమూర్తులు జస్టిస్ ఎస్‌ఏ నజీర్, బీఆర్ గవాయ్, బోపన్న, వి రామసుబ్రమణియన్, బీవీ నాగరత్నల ధర్మాసనం నోట్ల రద్దుపై పలు కీలక వ్యాఖ్యలు చేసింది. వీరిలో ఎక్కువ మంది నోట్ల రద్దును సమర్ధించారు. నోట్ల రద్దుకు సంబంధించి ఆరు నెలల కాలంలో రిజర్వ్ బ్యాంకుకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య సంప్రదింపులు ఉంటే సరిపోతుందని పేర్కొన్నారు.
ఇప్పటికే జరిగిపోయిన నోట్ల రద్దుపై ఉపశమనం ఇవ్వలేమన్నారు. నోట్ల రద్దు వ్యతిరేకంగా దాఖలైన దాదాపు 58 పిటిషన్లను కోర్టు కొట్టేపారు. అయితే, కేంద్రం నిర్ణయాన్ని జస్టిస్ నాగరత్న తప్పుబట్టారు. నోట్ల రద్దును గెజిట్ నోటిఫికేషన్ ద్వారా కాకుండా పార్లమెంట్ ద్వారా చేయాల్సి ఉండిందని అన్నారు. నోట్ల రద్దు వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని కూడా వెల్లడించారు. మరి, కేంద్ర ప్రభుత్వం 2016లో చేసిన నోట్ల రద్దును సమర్థిస్తూ సుప్రీం కోర్టు ధర్మాసనం తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.