ప్రపంచ వ్యాప్తంగా కరోనా సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. కరోనా తో మరణాలు మాత్రమే కాదు.. ఆర్థిక సంక్షోభం విపరీతంగా నెలకొంది. ముఖ్యంగా కరోనా ఎఫెక్ట్ పొరుగు దేశం శ్రీలంకపై భారీగానే పడింది. దీనికి తోడు ఇప్పుడు ఉక్రెయిన్ – రష్యా ల మద్య కొనసాగుతున్న యుద్దం మరింత ప్రభావం చూపిస్తుంది. గత కొంత కాలంగా శ్రీలంకలో ఆహార, ఆర్థిక సంక్షోభం తీవ్రస్థాయికి చేరింది.
ఇక్కడ నిత్యావసరాల ధరలు తాజాగా అమాంతం పెరిగిపోయాయి. కనీసం ఆహార పదార్ధాల దిగుమతులకు కూడా విదేశీ మారక నిల్వలు లేక, అవసరమైనంత అప్పు పుట్టక ఆ దేశం అల్లాడుతున్నది. గోరు చుట్టు రోకటి పోటులా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం పరిస్థితిని మరింత దిగజార్చింది. ప్రస్తుతం శ్రీలంకలో ఒక కోడిగుడ్డు రూ.35 కాగా, కిలో చికెన్ ధర ఏకంగా రూ.1000 పలుకుతోంది. కిలో ఉల్లిగడ్డలు రూ.200 కాగా, పాలపొడి రూ.1,945కి చేరింది. లీటర్ పెట్రోల్ రూ.283, లీటర్ డీజిల్ రూ.220గా ఉంది. అటు, డాలర్ తో శ్రీలంక కరెన్సీ విలువ రూ.270కి చేరింది. గ్యాస్ ధరలు అమాంతం పెరిగిపోవడంతో దేశ వ్యాప్తంగా 90 శాతం రెస్టారెంట్లు, హోట్లళ్లు మూతపడ్డాయి.
1970 కరువు పరిస్థితుల తర్వాత వచ్చిన అతిపెద్ద సంక్షోభం ఇదే అని అక్కడ ఆర్థికవేత్తలు అంటున్నారు. నిత్యావసరాల ధరలు పెరుగుతుండటంతో ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీలంకకు ప్రధానంగా పర్యాటకం, ఎగుమతుల ద్వారానే ఆదాయం సమకూరుతుంది. గత రెండున్నరేళ్లుగా కరోనా సంక్షోభం లంకను తీవ్రంగా దెబ్బతీసింది. మరోవైపు దీనికి బాధ్యత వహిస్తూ… అధ్యక్షుడ గోటబయ రాజపక్సే రాజీనామా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.