ఉద్యోగాలకు, పాఠశాలలు, కాలేజీలకు వెళ్లే వాళ్లు నిత్యం ప్రయాణించే సాధనం బస్సు. తక్కవ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు. అందుకే ఉద్యోగులు, విద్యార్థులు వీటిలోనే ఎక్కువగా ప్రయాణిస్తారు. అయితే ఇదంతా ఎంతో కొంత ఖర్చుతో కూడుకోవాల్సిందే. అయితే వీరి కోసమే ఓ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించాలంటే మన దగ్గర ఉన్న ఏకైక ఆప్షన్ బస్సు. ఉద్యోగాలకు, పాఠశాలలు, కాలేజీలకు వెళ్లే వాళ్లు రోజు ప్రయాణించేదీ బస్సులోనే. పురుషులైతే ఎక్కువగా బైక్, కారులపై వెళ్లిపోతుంటారు. మరీ ఉద్యోగాలు చేసే మహిళలు, విద్యార్థుల పరిస్థితి ఏంటీ. ప్రతి రోజు డబ్బులు పెట్టుకుని ప్రయాణించాలంటే తడిసి మోపుడు అవుతుంది. నెల రోజుల పాటు వెళ్లాలి కాబట్టి బస్సు పాస్ లేదా మంత్లీ కార్డ్ తీసుకుని ప్రయాణిస్తారు. దీని కోసం జీతంలో కొంత భాగం కేటాయిస్తారు. విద్యార్థులైతే తల్లిదండ్రులపై ఆధారపడుతుంటారు. ఇక మీ బాధలు తీరుస్తామంటోందీ ఆ ప్రభుత్వం.
వర్కింగ్ మహిళలు, పాఠశాల విద్యార్థులకు తీపి కబురు చెప్పింది కర్ణాటక ప్రభుత్వం. ఏప్రిల్ 1 నుండి ప్రభుత్వ ఉచితంగా బస్సుల్లో ప్రయాణించవచ్చునని ప్రకటించింది. కెఎస్ఆర్టీసీ స్లీపర్ బస్సులను మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. అయితే అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఈ ప్రకటన చేయడం గమనార్హం. మహిళలు స్వయం సమృద్ధిని సాధించాలన్న ఉద్దేశ్యంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టామన్నారు. ఈ పథకాన్ని మరింత సులభతరం చేసేందుకు ప్రస్తుతమున్న బస్సులతో పాటు మరిన్ని బస్సులను ఏర్పాటు చేస్తామన్నారు.
ప్రతి తాలూకాలో కనీసం ఐదు బస్సులు నడవాలని, దీనికి అవసరమైతే మరిన్ని నిధులను విడుదల చేస్తామని తెలిపారు. ” 2023-24 రాష్ట్ర బడ్జెట్‌లో శ్రామిక మహిళలు (వర్కింగ్ ఉమెన్స్), పాఠశాల విద్యార్థులకు ఉచిత పాస్ సౌకర్యాన్ని ప్రకటించడం ద్వారా ఆర్థిక అభివృద్ధిలో రవాణా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రయాణీకులకు మంచి సేవలు అందించేందుకు మా ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంటుంది’అని అన్నారు.
రైల్వే స్లీపర్ కోచ్‌ల మాదిరిగానే ఈ స్లీపర్ బస్సుల సముదాయంలో అనేక మంచి ఫీచర్లు అందించబడ్డాయి. వీటి వల్ల రాత్రి ప్రయాణం కూడా సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పారు. మహిళలు, విద్యార్థుల కోసం కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.