పక్షుల ప్రేమికులు, జంతువుల ప్రేమికులు చాలా మంది ఉంటారు. వాటి మీద ప్రేమతో వాటికి ఫుడ్ పెడుతుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో అవి మనుషుల ప్రాణాలకే ముప్పు తెస్తున్నాయి. పావురాల వల్ల మనుషులకు ముప్పు ఉందని, మేత వేస్తే జరిమానా విధిస్తామని నగర పాలక సంస్థ ప్రకటించింది.
గతంలో వీధి కుక్కలు ప్రదీప్ అనే చిన్నారిని ఎలా చంపాయో చూశాం. అయ్యో పాపం అని కుక్కల్ని చూసి జాలిపడాలా? లేక వీటి వల్ల మనుషులకు ప్రమాదం ఉందని తెలిసి జాగ్రత్త పడాలా? అంటే నూటికి 90 శాతం మంది మనుషులకే ప్రాధాన్యత ఇవ్వాలని అంటున్నారు. అయితే కుక్కల వల్లే కాదు, పావురాల వల్ల కూడా ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొంతమంది మేడ మీదకు వచ్చే పక్షులకు ముఖ్యంగా పావురాలకు మేత వేస్తుంటారు. అయితే పావురాలకు మేత వేస్తే జరిమానా విధిస్తామని మున్సిపల్ కార్పొరేషన్ హెచ్చరించింది. మేత వేయడం వల్ల వేసిన వారికే పెద్ద ప్రమాదం ఉందని హెచ్చరించింది. పావురాలకు మేత వేయడం వల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి సంక్రమిస్తుందని హెచ్చరించింది.
మహారాష్ట్రలోని థానే మున్సిపల్ కార్పొరేషన్ (టీఎంసీ) ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. పావురాలకు ఆహారం వేస్తే రూ. 500 జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ప్రజలను పావురాల వద్దకు వెళ్లకూడదని.. వాటిని నివాస ప్రాంతాల దగ్గరకు రానియ్యొద్దని హెచ్చరించింది. పావురాల వల్ల హైపర్ సెన్సిటివ్ న్యూమోనియా అనే ఊపిరితిత్తుల వ్యాధి సంక్రమిస్తుంది టీఎంసీ తెలిపింది. ఈ వ్యాధి బారిన పడకుండా ఉండేలా ప్రజలకు అవగాహన కల్పిస్తోంది టీఎంసీ. పోస్టర్ల ద్వారా ఇంటింటికీ హెచ్చరికలు పంపింది. ఎవరైనా పావురాలకు మేత వేయాలని చూస్తే జరిమానా తప్పదని పోస్టర్ లలో ముద్రించింది.
ముంబై, పూణె నగరాల్లో ఇప్పటికే పావురాల వల్ల వచ్చే హైపర్ సెన్సిటివ్ న్యూమోనియా కేసులు పెరుగుతున్నాయని.. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడేవారు ఈ వ్యాధికి గురయ్యే అవకాశాలు 60 నుంచి 65 శాతం ఉందని టీఎంసీ అధికారులు వెల్లడించారు. పావురాల వల్ల అలర్జీలు, ఇన్ఫెక్షన్లు వస్తాయని ఇప్పటికే పలువురు నిపుణులు హెచ్చరించారు. పావురాలను పెంచే వారు కూడా హైపర్ సెన్సిటివ్ న్యూమోనియా వ్యాధి బారిన పడుతున్నారని.. ఈ సంఖ్య ఎక్కువగా ఉందని అనేక సందర్భాల్లో నిపుణులు వెల్లడించారు. పావురాలను పెంచే యజమానులు పావురాల రెట్టలు శుభ్రం చేసే సమయంలో, వలలు అమర్చే సమయంలో ముఖానికి మాస్కు, చేతులకు గ్లౌజులు తొడుక్కోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.