కొన్ని రైల్వే స్టేషన్ల పేర్ల ఆఖర్లో పీహెచ్ అని రాసి ఉంటుంది. అలాంటి స్టేషన్లను మీరు ఎప్పుడైనా చూశారా? అసలు పీహెచ్ అని ఎందుకు రాసి ఉంటుందో తెలుసా..!
మన దేశంలో అతిపెద్ద ప్రజా రవాణా వ్యవస్థగా ఇండియన్ రైల్వేస్ను చెబుతుంటారు. అటు ఉత్తరాది నుంచి ఇటు దక్షిణాది వరకు, అలాగే ఈశాన్య రాష్ట్రాల్లోనూ భారీ నెట్వర్క్ కలిగినదిగా రైల్వేస్ను చెప్పొచ్చు. రోజూ లక్షలాది మంది ప్రజలు రైళ్లలో రాకపోకలు సాగిస్తుంటారు. అలాంటి భారతీయ రైల్వేకు సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఉంటాయి. వీటి గురించి పెద్దగా అందరికీ తెలిసే అవకాశం లేదు. అలాంటి ఆసక్తికర విషయాలను చూసుకుంటే.. రైల్వే పట్టాల మీద కంకర ఎందుకు ఉంటుంది? రైల్వే స్టేషన్ల పేర్ల చివర్లో సెంట్రల్, కంటోన్మెంట్ అని ఎందుకు ఉంటాయి అనే సందేహాలు ప్యాసింజర్లలో ఉంటాయి. అలాగే రైల్వే స్టేషన్ల పేర్ల ఆఖర్లో పీఎహెచ్ అని ఉండటం కూడా వీటిల్లో ఒకటి. మన దేశంలోని చాలా రైల్వే స్టేషన్ల పేర్ల వెనుక పీహెచ్ అని ఉంటుంది.
రైల్వే స్టేషన్ల పేర్ల చివర్లో పీహెచ్ అని ఉండటానికి ఒక కారణం ఉంది. వాస్తవానికి ఈ రైల్వే స్టేషన్లు మిగతా స్టేషన్ల కంటే చాలా ప్రత్యేకమైనవి. రైల్వే స్టేషన్ల పేరులో ఉండే పీహెచ్ అంటే ప్యాసింజర్ హాల్ట్ అని అర్థం. స్టేషన్ల పేర్ల వెనుక పీహెచ్ అని రాసి ఉంటే.. అక్కడ కేవలం ప్యాసింజర్ రైళ్లు మాత్రమే ఆగుతాయని అర్థం చేసుకోవాలి. ఈ స్టేషన్లు మిగతా స్టేషన్ల కంటే కాస్త భిన్నమైనవి, ప్రత్యేకమైనవి కూడా. ఎందుకంటే రైల్వే డిపార్ట్మెంట్ ఇక్కడ ఏ అధికారిని గానీ, ఉద్యోగిని గానీ నియమించదు. ఇలాంటి ప్యాసింజర్ హాల్ట్ స్టేషన్లను డీ క్లాస్ స్టేషన్లుగా పిలుస్తారు. ఈ స్టేషన్లలో రైళ్లు ఆగుతున్నట్లు కనిపించే సిగ్నల్ కూడా ఉండదు. మరి.. మీరు ఎప్పుడైనా పీహెచ్ అని రాసి ఉన్న రైల్వే స్టేషన్లను చూశారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.