దేశ ప్రధాని నరేంద్ర మోడీతో ఫొటోలు దిగాలని ఎవరు అనుకోరు చెప్పండి! కానీ ఆ అవకాశం వచ్చి, ఫొటోలు దిగినా.. వాటిని పొందడం ఆషామాషీ పనికాదు. అందుకే నమో యాప్లో ఒక కొత్త ఫీచర్ తీసుకొచ్చారు. దాని గురించి మరిన్ని వివరాలు..
మీరెప్పుడైనా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో ఫొటో దిగారా? ఒకవేళ దిగినా ఆ ఫొటో కనిపించడం లేదా? అయితే ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఈ ఫొటోను ఒక యాప్ ద్వారా తిరిగి పొందొచ్చు. అవును, నరేంద్ర మోడీ యాప్ లేదా నమో యాప్ ద్వారా ఆ ఫొటోలను తిరిగి పొందొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో మోడీతో దిగిన ఫొటోలను తిరిగి అందిస్తోంది నమో యాప్. అందుకోసం నమో యాప్లో ఏఐ సంబంధిత ఫొటో బూత్ ఫీచర్ను ఇటీవల యాడ్ చేశారు. ప్రస్తుతానికి ఈ యాప్లో ప్రధానికి సంబంధించిన 30 రోజుల ముందు ఫొటోలు మాత్రమే చూడొచ్చు. మున్ముందు నమో యాప్లో మరిన్ని అప్డేట్స్ చేయనున్నారట. దీంతో నెల రోజుల కంటే ముందు దిగిన ఫొటోలు కూడా పొందే వీలుంటుందని సమాచారం.
నమో యాప్ వినియోగదారులు ప్రధాని మోడీతో తాము దిగిన ఫొటోలు చూసుకునేందుకు ముందుగా యాప్‌ను ఓపెన్ చేయాలి. ఆ తర్వాత తమ ముఖాన్ని అందులో స్కాన్ చేసి సెర్చ్ చేయాలి. దీంతో గత 30 రోజుల్లో మోడీతో ఆ సెర్చ్ చేసిన ముఖానికి సంబంధించిన ఫొటోలు ఏమైనా దిగి ఉంటే చూపిస్తుంది. ఈ ఫేస్ సెర్చ్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వాడుతున్నామని అధికారులు తెలిపారు. ఇకపోతే, దేశవ్యాప్తంగా ప్రతిరోజూ ఏదో ఒక కార్యక్రమంలో మోడీ పాల్గొంటారనేది తెలిసిందే. ఈ క్రమంలో ఆయనతో చాలా మంది ఫొటోలు దిగుతుంటారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు ఆయనతో దిగిన ఫొటోలను పొందడం పెద్ద ఇబ్బందేమీ కాదు. కానీ సామన్యులకు ఇది చాలా కష్టం. అందుకే నమో యాప్లో మోడీతో దిగిన ఫొటోలను ఫేస్ సెర్చ్ ద్వారా పొందే అవకాశాన్ని కల్పించినట్లు తెలుస్తోంది.
People can trace their photos with PM Modi through AI, NaMo app gets new feature
Read @ANI Story | https://t.co/PrtC9fqVfl#Modi #NarendraModi #NaMo #ArtificialIntelligence pic.twitter.com/NXUhrpxn3o
— ANI Digital (@ani_digital) March 28, 2023