ఒమైక్రాన్ కేసులు పెరుగుతుండడం.. పండుగల నేపథ్యంలో కొవిడ్ వ్యాప్తిపై కేంద్ర ప్రభుత్వం సైతం హెచ్చరికలు చేయడంతో రాష్ట్రాలు అందుకు తగినట్లుగా సిద్ధమవుతున్నాయి. ఒక్కొక్కటిగా ఆంక్షలను విధిస్తున్నాయి. దేశంలో ఒమిక్రాన్ ఎఫెక్ట్ ఎక్కువగా మహారాష్ట్ర తో పాటు దేశ రాజధానిపైనే పడింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలను విధించాలని నిర్ణయం తీసుకుంది. ఈమేరకు రాష్ట్రంలో మరోసారి నైట్ కర్ఫ్యూ విధించింది. రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూ అమలు చేయనున్నారు.
కర్ఫ్యూ నిర్ణయం శుక్రవారం రాత్రి నుంచే అమలు చేస్తున్నట్టు మంత్రి అనీల్ పరబ్ ప్రకటించారు. కాకపోతే ఈ కర్ఫ్యూ ఎన్ని రోజులు విధిస్తారు అన్న విషయం పై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఇతర ఆంక్షలకు సంబంధించిన మార్గదర్శకాలు ప్రభుత్వం విడుదల చేయనుంది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య రాష్ట్రంలో 100 దాటింది. దీంతో రాష్ట్రంలో మరోసారి కఠిన ఆంక్షలను విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక ఒమిక్రాన్ ఎఫెక్ట్ పాఠశాలలపై కూడా పడినట్లు తెలుస్తుంది.
ఇది కూడా చదవండి : భారత్ లో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు!
ఈ మద్యనే పలు ప్రాంతాల్లోని పాఠశాలల్లో పలువురు విద్యార్థులకు కరోనా సోకడంతో ఆయా పాఠశాలలను మూసివేయడం తోపాటు అక్కడ అందరికీ కరోనా పరీక్షలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తం గా తెరిచిన పాఠశాలలను కొన్ని రోజులపాటు మూసివేయాలనే అంశంపై ఆలోచిస్తున్నామని మంత్రి వర్షా గైక్వాడ్ తెలిపినట్టు సమాచారం. కాకపోతే అఫిషియల్ గా ఇంకా ప్రకటించలేదని, అధిక కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో స్థానిక అధికారులు జిల్లా అధికారులు, నిర్ణయాలు తీసుకుంటారని చెబుతున్నారు.
ఇక కోవిడ్ నూతన ఆంక్షల విషయానికి వస్తే.. హోటళ్లు, జిమ్‌లు, స్పా, సినిమా హాళ్లు, ఆడిటోరియాలు తదితర ప్రాంతాల్లో కూడా 50 శాతం మందికే అనుమతి. బహిరంగ ప్రదేశాలలో నైట్ కర్ఫ్యూ సమయంలో అయిదుగురికి కంటే ఎక్కువ మంది గుమిగూడటంపై నిషేధం. వివాహ వేడుకలు కాకుండా ఇతర వేడుకల కోసం హాల్‌లలో 50 శాతం, బహిరంగ స్థలాల్లో సామర్థ్యాన్ని బట్టి 25 శాతం మించకూడదు. హాలులో పెళ్లికి హాజరయ్యేవారి సంఖ్య 100 మందికి మించకూడదు. బహిరంగ ప్రదేశా లలో జరిగే పెళ్లిళ్లకు 250 లేదా స్థలం సామర్థ్యం బట్టి 25 శాతం మందికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య మొత్తం 415కు పెరిగింది. ఒమిక్రాన్ వేరియంట్ పై పలు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.