భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. ఏదో విషయంలో అభిప్రాయ బేధాలు రావడం.. దాని గురించి వాదులాడుకోవడం.. గొడవపడటం చాలా కామన్. ఇక వివాహ బంధంలో ఉన్న గొప్పతనం ఏంటంటే.. అప్పుడే గొడవ పడతారు.. కాసేపు ఎడమోహం.. పెడమోహంలాగా ఉంటారు.. మళ్లీ కలిసిపోతారు. గొడవ మరీ పెద్దదయితే భార్య అలిగి పుట్టింటికి వెళ్లడం వంటివి చేస్తుంది. అదే మగవారైతే.. కొన్ని రోజుల పాటు మాట్లాడకుండా.. ఇంట్లో తినకుండా ఉంటారు. చాలా వరకు ఇలాంటి సంఘటనలే చోటు చేసుకుంటాయి. కాకపోతే.. ఇప్పుడు మీరు చదవబోయే సంఘటన మాత్రం కాస్త భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఓ భర్త.. భార్య మీద అలిగి.. ఏకంగా 42 ఏళ్లుగా అన్నం తినడం మానేశాడు. మరి ఎలా బతకగలుగుతున్నాడు అంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే..
ఈ విచిత్ర దంపతులు కథ.. ఒడిశాలో వెలుగు చూసింది. జైపుర్ జిల్లాలోని వికీపుర్ గ్రామానికి చెందిన రామచంద్ర (77)కు 55 ఏళ్ల క్రితం అనగా.. అతడి 22వ ఏట.. సీత అనే మహిళతో వివాహం జరిగింది. ఈ క్రమంలో వివాహం అయిన ప్రాంరభంలో దంపతులిద్దరి మధ్య చిన్న విషయంలో గొడవ జరిగింది. ఓ రోజు రామచంద్ర కూలి పనికి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చాడు. ఆకలేస్తుంది.. భోజనం వడ్డించమని భార్య సీతను అడిగాడు. కానీ అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న సీత.. వంట చేయలేదని.. అన్నం లేదని చెప్పింది. ఈ పరిస్థితుల్లో ఎవరైనా సరే.. మానవత్వంతో ఆలోచించి.. సరే పర్లేదు అనుకుంటారు. కుదిరితే.. వారే వంట చేసి.. భార్యకు కూడా వడ్డిస్తారు.
కానీ రామచంద్ర మాత్రం పరిస్థితిని అర్థం చేసుకోకుండా భార్యపై అలకబూనాడు. అప్పటి నుంచి కోపంతో అన్నం తినడం మానేశాడు. కేవలం టీ తాగి.. అటుకులు తింటూ జీవితం గడుపుతున్నాడు. మరి భార్యతో ఎలా ఉంటున్నాడు అంటే.. ఆమెతో కలిసి అన్యోన్యంగానే ఉంటున్నాడు. మాట్లాడుతున్నాడు. కేవలం అన్నం మాత్రం తినడం లేదు. ఇక ఈ విషయంలో ఎందరు ఎన్ని రకాలుగా చెప్పినా తన వైఖరి మార్చుకోవడం లేదు రామచంద్ర. బంధువులు, పిల్లలు, స్నేహితులు ఎవరు చెప్పినా.. అన్నంపై అలక మానలేదు. దాంతో ఈ విషయం చుట్టు పక్కల చర్చనీయాంశంగా మారింది. కనీసం చనిపోయేలోపైనా రామచంద్ర అన్నం తింటాడా లేదా అని చర్చించుకుంటున్నారు.