ఎర్రటి ఎండకు ఓ నిండు గర్భిణీ ప్రాణాలు కోల్పోయిన హృదయ విదారఘటన ఇది. కడుపులో పెరుగుతోన్న బిడ్డ యోగక్షేమాలు తెలుసుకునేందుకు వెళ్లిన ఆ తల్లి, ఎండ వేడిని తట్టుకోలేక, వడ దెబ్బ బారిన పడి ప్రాణాలు కోల్పోయింది.
దేశంలో భానుడి భగభగలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం 8 దాటిదంటే బయట కాలు పెట్టలేని పరిస్థితి. అదే మధ్యాహ్నం సమయమైతే ఎండ వేడితో పాటు విపరీతమైన వేడిగాలులు ఉంటున్నాయి. అత్యవసరమైతే తప్ప బయటకి రావొద్దని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. ఇంతటి ఎర్రటి ఎండలోనూ ఓ తొమ్మిది నెలల నిండు గర్భిణీ, వైద్య పరీక్షల కోసం 7 కిలోమీటర్ల కాలినడక సాగించింది. తంతోన్న తన బిడ్డ కదలికలు గుర్తుచేసుకుంటూ ఆ తల్లి ఎలాగోలా ఆస్పత్రికి చేరుకుంది. పరీక్షించిన వైద్య సిబ్బంది కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. అనంతరం ఆ సంతోష క్షణాలను గుర్తుచేసుకుంటూ మరలా అదే దారిన ఇంటికి చేరుకుంది. కానీ కాసేపటికే వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోయింది. ఈ హృదయ విదారక ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.
మహారాష్ట్ర, పాల్ఘర్‌లోని ఓసర్ వీరా గ్రామానికి చెందిన సోనాలి వాఘాట్(21) తొమ్మిది నెలల గర్భిణీ. ప్రతి నెల జనరల్ చెకప్ కోసం దండల్వాడి పీహెచ్‌సీకి హాజరయ్యేది. అక్కడి వైద్య పరీక్షలు ముగిసిన అనంతరం మళ్ళీ ఇంటికి చేరుకునేది. సోనాలి సోమవారం ఉదయం కూడా అలానే వైద్య పరీక్షల కోసం పీహెచ్‌సీకి బయలుదేరింది. అలా బయలుదేరిన ఆమె వారి గ్రామం నుంచి 3.5 కిలోమీటర్ల మేర నడిక సాగించి హైవేకు చేరుకుంది. అక్కడి నుంచి ఆటోలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లింది. పరీక్షించిన వైద్య సిబ్బంది కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. అనంతరం ఆ సంతోష క్షణాలను గుర్తుచేసుకుంటూ ఆ తల్లి మరలా ఆటోలో కొంత దూరం ప్రయాణించి, అక్కడి నుండి 3.5 కిలోమీటర్లు నడుచుకుంటూ తిరిగి ఇంటికి బయలుదేరింది. అయితే అప్పటికే ఎండలు భగభగమంటున్నాయి. మరోదారి లేకపోవడంతో ఆమె ఎలాగోలా మెల్లగా నడుచుకుంటూ ఇంటికి చేరుకుంది.
అలా ఇంటికి చేరుకున్న ఆ తల్లి, కాసిన్ని మంచినీళ్లు తాగి ఓ పక్కకు వాలింది. వడదెబ్బ బారిన పడిన ఆమె నీరసించి పోయి నన అవస్థలు పడింది. ఆమె పరిస్థితిని గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే ఆమెను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమెకు ప్రథమ చికిత్స అందించి.. అనంతరం మెరుగైన వైద్యం కోసం సబ్ డివిజనల్ ఆస్పత్రికి సిఫార్సు చేశారు. అక్కడినుండి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించింది. ఆమె కడుపులో ఉన్న గర్భస్థ శిశువు కూడా ప్రాణాలు కోల్పోయింది. దేశం అబివృద్ధిలో ముందుంజలో సాగిపోతోందని చెప్పుకొనే మన నేతలు, ఇలాంటి ఘటనలపై నోరు మెదకపోవటం గమనార్హం. ఈ విషాదకర ఘటనపై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.