ప్రజాప్రతినిధులు అంటే ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తులు. ప్రజల అవసరాలను తీర్చడం ప్రజాప్రతినిధుల కర్తవ్యం. ఇంకా చట్టసభలో ప్రజల సమస్యలు, అభివృద్ధి పనులపై మాట్లాడటం వారి బాధ్యత. శాసన సభ సమావేశాలు ఎంతో విలువైన కాబట్టి ప్రతి ప్రజాప్రతినిధి.. ప్రజల వాయిస్ ను అక్కడ బలంగా వినిపించాలి. అయితే నేటికాలంలో చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీ అసెంబ్లీలను, పార్లమెంట్ సమావేశాలకు డుమ్మాకొడుతుంటారు. కానీ కొందరు ప్రజాప్రతినిథుల నిజాయితీని చూస్తే ఔరా ! అనిపిస్తుంది. ఎన్ని ఇబ్బందులు ఉన్న తమ బాధ్యతలను మరవకుండా సమావేశాలకు, ఇతర ప్రజా కార్యక్రమాలకు హాజరవుతుంటారు. అలానే తాజాగా ఓ మహిళా ఎమ్మెల్యే తన బాధ్యత మరువక.. నెలల పసిబిడ్డతో అసెంబ్లీ వెళ్లింది. అలా ఎంతో బాధ్యతయుతంగా సమావేశాలకు హాజరైన ఆ మహిళా ఎమ్మెల్యేను తోటి ఎమ్మెల్యేలు అభినందనల వర్షం కురిపించారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.
మహారాష్ట్ర నాసిక్ జిల్లాకు చెందిన మహిళా ఎమ్మెల్యే సరోజ్ బాబూలాల్ అహిరే.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. ఈమె గత సెప్టెంబర్ 30న ఆమె ఒక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఇక అప్పటి నుంచి తన పసిపాపను చూసుకుంటూ ఆ మహిళా ఎమ్మెల్యే ఎంతో మురిసిపోతుంది. ఈ క్రమంలోనే మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. కరోనా మహమ్మారి కారణంగా గత రెండున్నర సంవత్సరాలుగా మహారాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించలేదు. తిరిగి రెండేళ్ల తరువాత మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈక్రమంలో ప్రజల సమస్యలను చెప్పాలనే తప్పన, ప్రజల తరపున వారి సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని సరోజ్ బాబూలాల్ అహిరే భావించారు.
తాను బాలింతైనా బాధ్యతను మరువలేదు. అందుకే ఆమె మూడు నెలలు కూడా నిండని పసిబిడ్డను తీసుకుని అసెంబ్లికీ వెళ్లింది. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి అసెంబ్లీకి హాజరుకాకుండా ఉంటే ప్రజలకు తాను ఏం సమాధానం చెప్పగలనని, అందుకే తనకు ఇబ్బందైనా కూడా వీలు చేసుకుని సమావేశాలకు వచ్చానని ఆమె తెలిపారు. సోమవారం మహారాష్ట్ర అసెంబ్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆమె లాంటి ఎమ్మెల్యేలు చాలా అరుదుగా కనిపిస్తారని, ఇలాంటి వారే నేటితరం రాజకీయాలకు అవసరమని చాలా మంది కామెంట్స్ చేశారు. మరి.. ఈ మహిళా ఎమ్మెల్యే చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.