టీవీ సింగింగ్ రియాలిటీ షోలలో ఇండియన్ ఐడల్ కు ప్రత్యేకస్థానం ఉంది. పేరుకి హిందిషో అయినా అక్కడ మన తెలుగుదనం పరిమళిస్తూనే ఉంటుంది. టీవీ షోల హిస్టరీలోనే అతి పెద్ద గ్రాండ్ గ్రాండ్ ఫినాలేగా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఇండియన్ ఐడల్ 12 గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు మీకోసం. మోస్ట్ అవైటెడ్ టీవీ రియాలిటీ షో ఇండియన్ ఐడల్ 12 సీజన్ ఫినాలే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రేపు ప్రసారం కానుంది. అంతే కాదు ఇక్కడ ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. టీవీ షోలలో ఇప్పటివరకు ప్రసారం కానంత లాంగెస్ట్ ఫినాలేగా ఇండియన్ ఐడల్ 12 ప్రసారం కానుంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మొదలై, రేపు రాత్రి 12 గంటల వరకు ఇండియన్ ఐడల్ 12 గ్రాండ్ ఫినాలే ప్రసారం కానుంది.
ఫినాలేను మరింత గ్రాండ్ గా మార్చేందుకు బాలీవుడ్ లోని ప్రముఖుల ప్రదర్శనలతో మరింత ఆకర్షణ పెంచనున్నారు. ఉదిత్ నారాయణ్, మికా సింగ్, అన్ను కపూర్, జావెల్ అలీ, అల్కా యాగ్నిక్, అను మాలిక్ మరియు న్యాయనిర్ణేతలు అను మాలిక్, హిమేష్ రేషమ్మియా, సోనూ కక్కర్‌తో సహా సినీ పరిశ్రమకు చెందిన గాయకులు అందరూ ఫైనల్‌లో పాల్గొంటారు. ఇంకా, బాలీవుడ్ ప్రముఖ తారలు సిద్ధార్థ్ మల్హోత్రా, తెలుగు వారికి సుపరిచితురాలు అందాల తార కియారా అద్వానీ కూడా గ్రేటెస్ట్ ఫైనల్‌లో భాగం కానున్నారు. ఫైనల్ ఎపిసోడ్‌లో ఈ సీజన్‌లోని సవాయి భట్, ఆశిష్ కులకర్ణి మరియు ఇతరులతో సహా అన్ని పోటీదారులు కూడా వేదికపై ప్రదర్శన ఇస్తారు.
తెలుగునాట కూడా ఇండియన్ ఐడల్ టీవీ షోకి మంచి ఆదరణే ఉంది. టాప్ 6 ఫైనలిస్ట్స్ షణ్ముఖ ప్రియ, పవన్ దీప్, అరుణిత కంజిలాల్, ధనిష్, సైలి కాంబ్లేలో ఎవరు ఇండియన్ ఐడల్ కాబోతున్నారని ప్రశ్నర్ధ్కంగానే ఉంది. తుదిసమరంలో మన తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియ ఉండటం, మన ప్రేక్షకులకు మరింత కిక్ ఇచ్చే అంశమే అవుతుంది. మరి చివరి మజిలీలో షణ్ముఖ ప్రియ తన ప్రదర్శనతో ప్రేక్షకులను మెప్పిస్తుందా అన్నది తెలియాలంటే రేపటి దాకా ఆగాల్సిందే.
ఇప్పటివరకు రెండు ఇండియన్ ఐడల్ జూనియర్ సీజన్‌లతో కలిపి పదకొండు సీజన్లు ప్రసారమయ్యాయి. సంవత్సరాలుగా మన తెలుగు గాయకులు అనేకమంది ఇండియన్ ఐడల్ వేదికపై తమ సత్తా చాటారు. కారుణ్య దగ్గర నుంచి ఇప్పటి షణ్ముఖ ప్రియా వరకు అందరు తమ విలక్షణ ముద్ర వేశారు. ప్రతిష్టాత్మక కార్యక్రమంలో తెలుగు గాయకుల ప్రవేశానికి మార్గం సుగమం చేస్తూ సింగర్ కారుణ్య ఇండియన్ ఐడల్ రెండో సీజన్ రన్నరప్ గా నిలిచాడు. తర్వాత సీజన్ 5లో టైటిల్ విన్నర్ గా నిలిచిన శ్రీరామచంద్ర మైనంపాటి తెలుగు సింగెర్స్ ఏ మాత్రం తక్కువ కాదు అని నిరూపించాడు. అంతేకాదు తన టాలెంటుతో బాలీవుడ్‌లో సుభానల్లా, బల్మా వంటి హిట్ నంబర్లు అందించాడు.
బాహుబలిలో ‘మనోహరి’ పాట పాడి అందరి దృష్టిని ఆకర్షించిన రేవంత్… అక్కడితో ఆగకుండా 2017లో ఇండియన్ ఐడల్ 9 టైటిల్ విన్నెర్ గా తన సత్తా చాటాడు. ఇండియన్ ఐడల్ 9లో హైదరాబాద్ కుర్రాడు పి.వి.ఎన్ .ఎస్.రోహిత్ టాప్ 3గా నిలిచి ప్రేక్షకాదరణ పొందాడు. ప్రముఖ సింగర్ సుఖ్వీందర్ సింగ్ ను తన సింగిల్ స్కిల్స్‌తో బాగా ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఇండియన్ ఐడల్ 12 టైటిల్ కోసం పోటీపడుతున్న వైజాగ్‌కు చెందిన పదిహేడేళ్ల షణ్ముఖ ప్రియ తన అసాధారణ యోడెలింగ్ నైపుణ్యాలకు పేరుగాంచింది. తన గాన మాధుర్యంతో సంగీత ప్రియులను అలరిస్తున్నారు. లిటిల్ చాంప్స్, పాడుతా తీయగా వంటి పోటీల్లో పాల్గొని ప్రశంసలు అందుకున్నారు. సీజన్ 12లో మరో తెలుగమ్మాయి శిరీష ఫైనల్ చేరలేక పోయినా తన పాటలతో ఇండియన్ ఐడల్ లో అభిమానులను సంపాదించుకున్నారని చెప్పాలి.