బెట్టింగ్ వల్ల అప్పులపాలయ్యి.. ప్రాణాలు తీసుకుంటున్న వారి గురించి నిత్యం వార్తలు చదువుతూనే ఉంటాం. వందకు వెయ్యి, పదివేల రూపాయలు వస్తాయనే అత్యాశతో.. వేలకువేలు బెట్టింగ్ వేసి.. అప్పులపాలయ్యి.. ఆఖరికి వాటిని తీర్చలేక ప్రాణాలు తీసుకుంటున్న వారు ఎందరో ఉన్నారు. అయితే అప్పుడప్పుడు ఈ బెట్టింగ్ యాప్‌ల్లో చాలా తక్కువ మొత్తంతో లక్షలు, కోట్లు సంపాదించిన వారు కూడా వెలుగులోకి వస్తారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కేవలం 49 రూపాయలు ఇన్వెస్ట్ చేసి కోటి రూపాయలు గెలుచుకున్నాడు ఓ పేద యువకుడు. డ్రీమ్ 11లో టీమ్ సెట్ చేసి.. ఈ మొత్తం గెలిచాడు. ఆ వివరాలు..
ఈ సంఘటన మధ్యప్రదేశ్, సింగరౌలీ జిల్లా బిందుల్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రామేశ్వర్ సింగ్ అనే పేద గిరిజన వ్యక్తి.. ప్రభుత్వ పాఠశాలలో తాత్కాలిక పద్దతిలో టీచర్‌గా పని చేస్తున్నాడు. ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే. ఈ క్రమంలో అప్పుడప్పుడు డ్రీమ్ 11 ద్వారా తక్కువ మొత్తంతో ఎక్కువ డబ్బులు గెలిచిన వారి గురించి వినేవాడు రామేశ్వర్. తాను కూడా అలానే బాగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో రెండేళ్లుగా డ్రీమ్ 11లో టీమ్‌లు సెట్ చేస్తున్నాడు. అయితే ప్రతి సారి నిరాశే ఎదురయ్యేది. కానీ తాజాగా జరిగిన భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగా అతడి దశ మారింది.
భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ కోసం ఏకంగా 9 టీమ్‌లు సెట్ చేశాడు రామేశ్వర్. మ్యాచ్ పూర్తయ్యేసరికి.. అదృష్టం అతడిని పలకరించింది. 49 రూపాయలు పెట్టుబడి పెడితే.. ఏకంగా కోటి రూపాయలు కలిసి వచ్చింది. ఇక రామేశ్వర్ కుటుంబ సభ్యుల ఆనందానికి అంతే లేకుండా పోయింది. వెంటనే ఊరందరికి స్వీట్లు పంచి.. సంబరాలు చేసుకున్నారు రామేశ్వర్ కుటుంబ సభ్యులు.
ఈ సందర్భంగా రామేశ్వర్ మాట్లాడుతూ.. ‘‘మాది చాలా పేద కుటుంబం. ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు ఉండేందుకు సొంతంగా ఇల్లు కూడా లేదు. అయితే డ్రీమ్ 11 ద్వారా ఎందరో డబ్బులు గెలవడం చూశాను. నేను కూడా ఏదో ఓ రోజు డ్రీమ్11 ద్వారా బాగానే గెలుస్తానని నమ్మాను. గత రెండేళ్లుగా టీమ్‌లు సెట్ చేస్తున్నాను. అనేక సార్లు నిరాశే ఎదురయ్యింది. కానీ నేను ఓటమిని అంగీకరించలేదు. ఏదో ఒక రోజు కోటీశ్వరుడిని అవుతానని నమ్మకం ఉండేది. నేటితో అది నెరవేరింది. ఈ సారి 49 రూపాయలు పెట్టుబడి పెట్టి.. కోటి గెలుచుకున్నాను. వచ్చిన మొత్తంతో కొత్త ఇల్లు కట్టుకుంటాను. అప్పులు తీర్చుకుంటాను’’ అని చెప్పాడు.
ఈ వార్త తెలిసిన తర్వాత చాల మంది.. ఇలాంటి యాప్‌ల పట్ల ఆకర్షితులైతే.. జీవితాలు నాశనం అవుతాయి. పని పాటా మానేసి.. ఒకేసారి ధనవంతులం కావాలనే అత్యాశతో బెట్టింగ్‌లు పెడుతూ.. అప్పుల పాలయ్యి.. ఆఖరికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు వస్తాయి. వీటిల్లో లాభం చాలా తక్కువ.. కానీ నష్టం మాత్రం భారీగానే ఉంటుంది. కనున ఇలాంటి యాప్‌ల జోలికి పోకుండా.. కష్టపడి డబ్బులు సంపాదించుకోవడం ఉత్తమం అంటున్నారు నిపుణులు.