అర్థం చేసుకోవడంపైనే వివాహ జీవితాలు ఆధారపడి ఉన్నాయి. చిన్నఅపార్థాలు, అనుమానాలు.. సంసారంలో కలతలు రేపి, మనశ్శాంతిని పొగొడతాయి. పచ్చని కాపురం కాస్తా..నరక ప్రాయంగా మారిపోతుంది. చిన్న సమస్యలకే విడిపోదామని నిర్ణయించుకున్న అటువంటి కొన్ని జంటలను ఏకం చేశారు పోలీసులు.
దేశంలో సగం పెళ్లిళ్లు పెటాకులకు దారి తీయడానికి సగం కారణం సమయం లేకపోవడం. ఒకరి మనసు గురించి మరొకరు తెలుసుకునేందుకు సమయం కేటాయించకపోవడంతో పొరపచ్చాలకు కారణమౌతున్నాయి. చిన్న చిన్న సమస్యలే చిలికి చిలికి గాలి వానగా మారి.. విడాకుల వరకు వెళ్లిపోతున్నాయి. పరిష్కరించే మార్గాలున్నా.. అన్వేషించకుండా ఆవేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్న జంటలు దేశంలో చూస్తూనే ఉన్నాం. కొన్ని సార్లు ఇగోలకు పోయి.. పచ్చని సంసారంలో నిప్పులు మన చేతులతో మనమే పోసుకుంటున్నాం. దీంతో భార్యా భర్తలే కాదూ వారికి పుట్టిన బిడ్డలు సైతం తీవ్ర ప్రభావానికి గురౌతున్నారు. ఇలా చిన్న సమస్యలకు పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన దంపతులను ఒక్కటి చేసేందుకు వినూత్నంగా ఆలోచించారు పోలీసులు.
తన భర్త ఇలా అంటే, తన భార్య ఇలా అని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేసిన జంటలను కలిపేందుకు రంగంలోకి దిగారు పంజాబ్‌లోని లూథియానా పోలీసులు. చిన్న తగాదాలకే కంప్లయింట్స్ చేసుకున్న దంపతులను కలిపేందుకు పోలీసులే మన్మధులుగా మారారు. అటువంటి దంపతులను మూవీ డేట్ వైపుకు నడిపించారు. దీనికి వాలంటైన్స్ డే వేదిక అయింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సిఎస్ఆర్) కింద సుమారు 20 మంది దంపతులకు ఉచితంగా సినిమా టికెట్లు అందించారు. అప్పుడప్పుడూ వారితో సినిమాకు, షికార్లకు వెళ్లాలని సూచించారు. ‘పోలీస్ విత్ హార్ట్’ కార్యక్రమం కింద చిన్నపాటి వివాదాలు ఏర్పడిన జంటలను సామరస్యంగా పరిష్కరించుకునేలా ఈ ప్రయత్నం చేశామని పోలీసులు వెల్లడించారు.
మహిళా శిశు సంక్షేమ శాఖలో ఫిర్యాదు అయిన కొన్ని కేసులకు సంబంధించిన దంపతులను పోలీసులు పిలిచి, వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం మరో నూతన అధ్యాయానికి నాంది పలకాలంటూ వారందరికీ పుష్పగుచ్ఛాలు, స్వీట్లు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. దీనిపై అదనపు డిప్యూటీ పోలీస్ కమిషనర్ స్పందిస్తూ.. మహిళా సెల్‌లో గత కొన్నిరోజులుగా నమోదైన కొన్ని కేసులను పరిశీలించి, ఆ జంటలను పిలిచి సమస్యను పరిష్కరించారు. ఆ తర్వాత మూవీ డేట్ కు వెళ్లాలని సూచించామన్నారు. సిఎస్ఆర్ కింద పివిఆర్ వంటి థియేటర్లతో సమన్వయం ఏర్పరుచుకున్న పోలీసులు.. సినిమా టికెట్లను వారికి ఉచితంగా అందించారు. అయితే తమ సమస్యలు పరిష్కారం కావడం పట్ల ఆ జంటలను కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. పోలీస్ చర్యలను దంపతులు కొనియాడుతున్నారు. లూథియానా పోలీసుల చర్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.