అతివ అందాన్నే కాదూ, ధైర్య సాహాసాలు ప్రదర్శించగలదు. వారి శక్తి, యుక్తులను తక్కువ అంచనా వేస్తే.. తలకిందులు చేయగలదు. మగువ తలుచుకుంటే సాధించలేనిదీ ఏదీ లేదు. తన మాన, ప్రాణాలకు హాని తలపెడితే ఎంతడి పురుష పుంగవుడునైనా అథో:పాతాళానికి తొక్కేయగల సాహాసి మహిళ. అలానే ఓ మహిళను తక్కువ అంచనా వేశాడో యువకుడు. అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. అతడి చర్యను ప్రతిఘటించేందుకు ఆమె చేసిన పనికి దెబ్బకు నిందితుడు విలవిలలాడిపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఇంతకూ ఏం జరిగిందంటే..?
మీరట్ లోని దౌరాలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గ్రామంలోని ఓ మహిళ.. తన పొలంలో పనులు చేసుకుంటుండగా మోహిత్ షైని అనే నిందితుడు వెనుక నుండి వచ్చి గట్టిగా పట్టుకున్నాడు. అయితే ఈ చర్యతో ఒక్కసారిగా షాక్ గురైన మహిళ, వెనుక నుండి తనను పట్టుకున్నదీ ఎవరో గుర్తించలేకపోయింది. ఆమెను కింద పడేసిన నిందితుడు.. ఆమె దుస్తులు చించే ప్రయత్నం చేశాడు. అనంతరం ఆమెపై పడి బలవంతంగా ముద్దు పెట్టేందుకు ప్రయత్నించాడు. తనను తాను రక్షించేకునే క్రమంలో ఆ యువకుడి పెదాలను ఆమె గట్టిగా కొరికేసింది. దీంతో పెదం ముక్క ఊడివచ్చి.. విపరీతంగా రక్తం కారింది. దీంతో నొప్పి అనిపించి, ఆమెను వదిలేశాడు. వెంటనే ఆమె గట్టిగా కేకలు వేసింది.
ఆమె కేకలు విన్న అక్కడి జనం పొలంలోకి పరుగులు పెట్టారు. జరిగిందంతా ఆమె చెప్పగా.. నిందితుడ్ని పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, మహిళ పెదాన్ని కొరకడంతో ఊడిన ముక్కను పోలీసులు సేకరించారు. నిందితుడ్ని చికిత్స నిమిత్తం సమీప ఆసుప్రతికి తరలించారు. సదరు మహిళ భర్త ఇచ్చిన ఫిర్యాదుతో నిందితుడిపై అత్యాచార యత్నం, లైంగిక వేధింపుల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు దౌరాలా పోలీస్ ఇన్ చార్జ్ సంజయ్ కుమార్ శర్మ తెలిపారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.