ఒక పక్క ఐఏఎస్ అయిన ఆనందం. మరోపక్క పండంటి బిడ్డకు తల్లి అయ్యానన్న సంతోషం. బిడ్డ పుట్టిన రెండు వారాలకే పోస్టింగ్ వచ్చింది. ఇంట్లో ఉండి బిడ్డను చూసుకోవాలా? కార్యాలయానికి వెళ్లి ఐఏఎస్ గా బాధ్యతలు చేపట్టాలా అన్న ప్రశ్న వస్తే ఆమె రెండిటినీ సమర్థవంతంగా బ్యాలెన్స్ చేశారు. ఒక చేత్తో బిడ్డను ఎత్తుకుని.. మరొక చేత్తో ఆఫీస్ పనులు చూసుకున్నారు. ఆమె మరెవరో కాదు సౌమ్య పాండే.
ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ ప్రాంతానికి చెందిన సౌమ్య పాండే.. 10వ తరగతిలో 98 శాతం, 12వ తరగతిలో 97.8 శాతం మార్కులతో అత్యున్నత ప్రతిభను కనబరిచారు. ఇంజనీరింగ్ లో గోల్డ్ మెడలిస్ట్. చదువులోనే కాదు ఆట, పాటల్లో కూడా ముందుంటారు. క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నారు. బాస్కెట్ బాల్ ప్లేయర్ కూడా. ఎన్సీసీ బీ, సీ సర్టిఫికెట్లు కూడా పొందారు. ఈమె 2016లో యూపీఎస్సీ పరీక్ష రాశారు. 2017లో సివిల్స్ ఫలితాలు వచ్చిన సమయంలో ఆమెకు నమ్మకం లేదు. నమ్మకం లేక తన హాల్ టికెట్ నంబర్ ను మార్కుల లిస్టులో కింద నుంచి చెక్ చేస్తున్నారు. పైకి వెళ్లే కొద్దీ ఆమె నంబర్ కనిపించడం లేదు. ఆమె టెన్షన్ పడ్డారు.
అప్పుడు ఆమె తల్లి పై నుంచి చూడమని సలహా ఇచ్చారు. అలా పై నుంచి చూస్తూ నాలుగో నంబర్ దగ్గరకు వచ్చారు. అంతే నాలుగో ర్యాంకు ఆమెదే. ఫస్ట్ అటెంప్ట్ లో సివిల్స్ సాధించడమే కాకుండా టాప్ 5 లో నిలిచారు. తర్వాత కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. 2020లో కరోనా మొదటి వేవ్ లో లాక్ డౌన్ విధించారు. అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఆ సమయంలో కొన్ని ప్రభుత్వ విభాగాలు మాత్రమే పని చేశాయి. ఆ సమయంలో 2 వారాల బిడ్డతో కార్యాలయానికి వెళ్లారు. అప్పటికి ప్రసవం జరిగి 14 రోజులు మాత్రమే అయ్యింది. అయినా గానీ ఆమె పసిబిడ్డతో డ్యూటీకి వెళ్లి విధులు నిర్వహించారు. ఆరు నెలలు మెటర్నిటీ లీవ్ తీసుకునే అవకాశం ఉన్నా సరే ఆమె అవేమీ లెక్క చేయకుండా పసిబిడ్డతో డ్యూటీ చేశారు. ఒక చేత్తో పసిబిడ్డను, మరొక చేత్తో ఆఫీస్ పనులను నిర్వహిస్తున్న ఫోటో అప్పట్లో బాగా వైరల్ అయ్యింది.
కోవిడ్-19 సమయంలో సక్రమంగా పనులు చేయడం ప్రభుత్వ అధికారుల కర్తవ్యమని ఆమె అన్నారు. ఆ సమయంలో ఆమె ఎస్డీఎం అధికారిగా నియమించబడ్డారు. గ్రామంలో మహిళలు గర్భధారణ సమయంలో ఇంటి పనులు అన్నీ చేస్తారు. ప్రసవించిన తర్వాత ఇంటి పనులు చేస్తూనే పిల్లల సంరక్షణ చూసుకుంటారు. సరిగ్గా ఇలానే తాను కూడా మూడు వారాల బిడ్డతో పరిపాలన విధులు నిర్వహించగలుగుతున్నానని అప్పట్లో ఆమె వ్యాఖ్యానించారు. పసిబిడ్డతో కార్యాలయానికి వెళ్లి పని చేయడానికి తనకు తన కుటుంబం మద్దతుగా నిలిచిందని ఆమె అన్నారు. 2019 జూలై నుంచి సెప్టెంబర్ వరకూ ఘజియాబాద్ లో ఎస్డీఎం ఆఫీసర్ గా పని చేశారు. సెప్టెంబర్ లో ఆమెకు ఆపరేషన్ జరిగింది. ఆ సమయంలో 22 రోజుల సెలవు తీసుకున్నారు. అయితే ప్రసవించిన రెండు వారాల తరువాత ఆమె విధుల్లో చేరారు. మరి ఒక చేత్తో పసిబిడ్డను బిడ్డను ఎత్తుకుని.. విధులు నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలిచిన ఈ మహిళా ఐఏఎస్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.