ఐఏఎస్, ఐపీఎస్ మహిళా అధికారిణుల వివాదాన్ని కర్ణాటక సీరియస్ గా తీసుకుంది. మొదట చూసిచూడనట్లు వదిలేసిన ప్రభుత్వ అధికారులు, వ్యక్తి గత ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవరకు దారితీయడంతో చర్యలు చేపట్టారు. బాధ్యతయుతమైన పదవిలో ఉండి బహిరంగ విమర్శలకు దిగినందుకుగానూ ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఐఏఎస్ రోహిణి సింధూరి, ఐపీఎస్ రూపా మౌద్గిల్ అధికారిణుల మధ్య వివాదం తారస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. రూప మౌద్గిల్.. రోహిణి సింధూరికి సంబధించిన వ్యక్తిగత ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడం, అందుకు ప్రతిగా సింధూరి అదే స్థాయిలో రియాక్ట్ అవ్వడం అందరికీ తెలిసిందే. ఇలా పబ్లిక్ గా ఒకరిపై ఒకరు బహిరంగంగా విమర్శలు చేసుకోవడంపై కర్ణాటక ప్రభుత్వం సీరియస్ అయ్యింది. వీరిద్దరికి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి ప్రస్తుతం రాష్ట్ర ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా.. ఆ స్థానంలో ఐఏఎస్ అధికారి హెచ్ బసవరాజేంద్రను నియమించింది. మరోవైపు.. కర్ణాటక హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా పని చేస్తున్న రూపా మౌద్గిల్ స్థానంలో ఐఏఎస్ అధికారిణి డి భారతిని నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని తెలిపింది. ప్రస్తుతానికి వీరిద్దరికి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. అలాగే.. రూప మౌద్గిల్ భర్త మునీష్ మౌద్గిల్‌ను కూడా బదిలీ చేసింది. ఆయనను ప్రచార శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Karnataka | IPS officer D Roopa Moudgil and IAS officer Rohini Sindhuri transferred without posting after fight on social media over sharing private photos. pic.twitter.com/YdP5QL4OUg
— ANI (@ANI) February 21, 2023
కాగా, ఈ అధికారిణిలిద్దరూ గతంలో మంచి మిత్రులని సమాచారం. అయితే వారి మధ్య విభేదాలు రావడంతో ఈ వివాదం ప్రారంభమయ్యింది. మొదట రోహిణి సింధూరికి సంబంధించిన కొన్ని ప్రైవేట్ ఫోటోలను రూపా మౌద్గిల్ తన పేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. ముగ్గురు ఐఏఎస్ మేల్ ఆఫీసర్లకు సింధూరి తన వ్యక్తిగత ఫోటోలను పంపి సర్వీస్ రూల్స్‌ను బ్రేక్ చేసినట్లు రూపా మౌద్గిల్ తన పోస్టులో ఆరోపించింది. సింధూరిపై అవినీతి ఆరోపణలు ఉన్నట్లు కూడా రూప తన పోస్టులో పేర్కొంది. ఈ ఆరోపణలపై రోహిణి సింధూరి కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు. రూపా మౌద్గిల్ మతిస్థిమితం కోల్పోయారని.. ఎప్పుడు వార్తల్లో ఉండాలనే తపనతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది. బాధ్యతయుతమైన పదవిలో ఉండి ఇలా బహిరంగంగా విమర్శలకు దిగడంతో కర్ణాటక ప్రభుత్వం బదిలీ చేస్తూ చర్యలు తీసుకుంది.