గతంలో పెళ్లిళ్లు ఐదు రోజుల పాటు జరిగేవట. బంధు మిత్ర సపరీవారమంతా కదలి వచ్చేవారు. భాజా భజంత్రీలు, సన్నాయి మేళం, మైకు సెట్టులతో పెళ్లి ఇల్లు ఇట్టే తెలిసిపోయేది. ఆ తర్వాత పెళ్లి ఒక రోజు తంతుగా మారిపోయింది. కానీ ఇప్పుడు పెళ్లిళ్లు మాత్రం పూటలో జరిగిపోతున్నాయి. బంధు మిత్రులు అవసరం లేదు. పెళ్లి కుమార్తె, కుమారుడు ఉంటే సరిపోతుంది. పోనీ ఆ పెళ్లిళ్లైనా పీటల వరకు చేరుతున్నాయా అంటే నమ్మలేని పరిస్థితి. ఈ మధ్యలో పెళ్లి కుమారుడు, వధువు కుటుంబాల పెద్దలకు ఏదైనా సమస్య వచ్చిందా ఆ పెళ్లి పెటాకులైనట్లే. అటువంటిదే ఈ ఘటన.
ఇంకొద్ది సేపటిలో పెళ్లి పీటలెక్కాల్సినా పెళ్లి కుమార్తె నాకీ పెళ్లి వద్దు అంటూ ఆపేసింది. దాని కారణం తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు. డబ్బులను సరిగా లెక్కించలేదన్న కారణంతో వధువు వివాహాన్ని నిలిపివేసింది. ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్ ఫర్రూఖబాద్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రీటా సింగ్ కు ఓ వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. అయితే పెళ్లి తంతులో భాగంగా పూజారీ వరుడితో కొన్ని ఆచారాలు నిర్వహిస్తుండగా.. వింతగా ప్రవర్తించడంతో అతడిపై అనుమానం వ్యక్తం చేశాడు. అతడి మానసిక సరిగ్గా లేదని పూజారీ వధువు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు.
ఈ విషయాన్ని నిర్ధారించేందుకు వధువు కుటుంబం వరుడ్ని పిలిచి 30 పది రూపాయల నోట్ల కట్లను అందించి,లెక్కించమన్నారు. అయితే పెళ్లి కుమారుడు సరిగ్గా లెక్కించపోవడంతో పెళ్లి కుమార్తె అక్కడి నుండి వెళ్లిపోయింది. దీంతో ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ విషయం పోలీసులకు వరకు చేరింది. వారు వచ్చి సర్థి చెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ.. పెళ్లి కుమార్తె వివాహం చేసుకునేందుకు నిరాకరించడంతో పెళ్లి ఆగిపోయింది. అయితే దీనిపై ఎటువంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు చెప్పారు. మొత్తానికి లెక్కలు రాక ఓ పెళ్లి ఆగిపోవడం విడ్డూరమనిపించకమానదు. ఇలాంటి కారణాలతో అర్థంతరంగా ఆగిపోతున్న పెళ్లిళ్లపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.