నెలసరి.. ఆడవారిలో ఈ పదం వింటేనే వణుకు పుడుతుంది. ఎందుకంటే ఆ రోజుల్లో వారు పడే బాధ వర్ణనాతీతం. అంతటి బాధలోనూ భార్యగా, తల్లిగా, ఉద్యోగిణిగా తన బాధ్యతలను ఎప్పుడూ విస్మరించదు, వాయిదా వేయదు. ఇప్పటికే చాలా కంపెనీలు తమ లేడీ ఎంప్లాయిస్‌కి నెలలో ఒకరోజు తమ పిరియడ్స్ కోసం సెలవు పెట్టే అవకాశాన్ని కల్పించాయి కూడా.
ఆడవాళ్లు ఎంతటి బాధను అనుభవిస్తున్నా కూడా పిరియడ్స్ గురించి ఎక్కడా మాట్లాడకూడదు. ఎవరితో చర్చించకూడదు. సమాజంలో వాటి గురించి అసలు చర్చించకూడదనే భావనతోనే అంతా గడుపుతున్నారు. నిజానికి వాళ్లు పడే బాధ ఏంటో మగవాళ్లకు కూడా తెలిస్తే అలాంటి అభిప్రాయాలు, ఆలోచనలు మారే అవకాశం ఉంటుందేమో? అదే ఆలోచనతో ఫీల్ ది పెయిన్ అనే ఓ కార్యక్రమాన్ని చేపట్టారు.
కేరళలోని విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పిరియడ్స్ గురించి దేశవ్యాప్తంగా సాధారణంగా చర్చించుకునే పరిస్థితులు తీసుకురావడమే తమ ఉద్దేశమని చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగా కొన్ని స్టిములేటర్స్ ను మాల్స్, కళాశాలలకు తీసుకెళ్తుకున్నారు. అక్కడున్న కొందరిని వాలంటీర్లుగా తీసుకుని వారికి ఈ స్టిములేటర్ తగిలిస్తున్నారు. దానితో 1 నుంచి 10 వరకు నొప్పిని క్రియేట్ చేయచ్చు.
అందులో పాల్గొన్న పురుషులు దాదాపు 4 పాయింట్లు పెట్టగానే నొప్పికి తట్టుకోలేక విలవిల్లాడారు. కేకలు వేస్తూ అది తీసేయాలంటూ వేడుకున్నారు. పురుషులకు నెలసరి నొప్పులు రావడం, వారి రియాక్షన్ ను అక్కడున్న స్త్రీలు రికార్డ్ చేశారు. అయితే అదే స్టిములేటర్‌ను ఆడవాళ్లకు పెట్టారు. గరిష్టంగా 10 పాయింట్లు పెట్టినా కూడా వాళ్లు కనీసం తొణకలేదు. ఒక డాక్టర్ ఆ స్టిములేటర్ గురించి మాట్లాడుతూ “వాస్తవానికి స్త్రీలు అనుభవించే పిరియడ్స్ పెయిన్‌లో ఇది కేవలం 10 శాతం మాత్రమే” అంటూ చెప్పుకొచ్చారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పురుషులు మాట్లాడుతూ.. “అది నిజంగా ఎంతో భయంకరమైన నొప్పి. జీవితంలో మళ్లీ నేను ఆ నొప్పిని అనుభవించాలి అనుకోవడం లేదు” అంటూ చెప్పుకొచ్చారు. నిజానికి ఇలాంటి క్యాంపైన్స్ విదేశాల్లో ఎప్పటి నుంచో జరుగుతూనే ఉన్నాయి. వారు స్త్రీలు అనుభవించే నొప్పిని చూసి ఎంతో భయపడిపోయారు. నెలసరి రోజుల్లో వారికి ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటామంటూ మాటిచ్చారు. ఇలాగే గతంలో చేసిన ఒక ఎక్స్ పెరిమెంట్ వీడియో కింద పోస్ట్ చేస్తున్నాం. ఆ వీడియో చూసి ఈ ఫీల్ ది పెయిన్ క్యాంపైన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.