ఏ విమానమో, హెలికాఫ్టరో అందనంత ఎత్తు నుంచి ఎగురుతుంటే చూసి మురిసిపోతుంటారు. పిల్లకాయలైతే చేతులు ఊపుతూ బాయ్ బాయ్ అని కేరింతలు కొడుతుంటారు. ఆ విమానం గానీ, హెలికాఫ్టర్ గానీ మన ఇంటి మీద నుంచి వెళ్తే బాగుణ్ణు అని అనుకుంటారు చాలా మంది. కానీ ఒక రైతు మాత్రం తక్కువ ఎత్తు నుంచి హెలికాఫ్టర్ వెళ్లినందుకు పైలట్ పై ఫిర్యాదు చేశాడు. హెలికాఫ్టర్ శబ్దం వల్లే తన గేదె చనిపోయిందని ఒక రైతు పోలీస్ స్టేషన్ గడప తొక్కాడు. పలానా ఎమ్మెల్యే హెలికాఫ్టర్ వల్ల తన గేదె చనిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడో రైతు. వినడానికి వింతగా ఉన్నా ఇది రైతు యొక్క జీవిత సమస్య. ఆయనకి ఉన్న ఆధారం అదొక్కటే. నిత్యం జీవనోపాధి కలిగిస్తున్న గేదె చనిపోతే ఎవరికైనా బాధగానే ఉంటుంది. అందుకే తనకి నష్టపరిహారం చెల్లించాలంటూ పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు.
నిత్యం జీవనోపాధి కలిగిస్తున్న గేదె చనిపోతే ఎవరికైనా బాధగానే ఉంటుంది. అందుకే తనకి నష్టపరిహారం చెల్లించాలంటూ పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ లోని అల్వార్ జిల్లా కోహ్రానాకు చెందిన బల్వీర్ అనే రైతుకి తన గేదెనే ఆధారం. అయితే బహ్ రోడ్ ప్రాంతం ఎమ్మెల్యే బల్జీత్ యాదవ్ ఆదివారం నాడు నియోజకవర్గంలో పర్యటించారు. ఎమ్మెల్యే రాక సందర్భంగా అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. హెలికాఫ్టర్ నుంచి ఎమ్మెల్యేపై పూల వర్షం కురిపించారు. అలా చాలా సేపు ఆ గ్రామంలో ఎగిరిన హెలికాఫ్టర్.. ఆ తర్వాత కోహ్రానా అనే గ్రామం మీదుగా వెళ్ళింది.
అయితే ఆ గ్రామంలో హెలికాఫ్టర్ తక్కువ ఎత్తులో ఎగరడం వల్ల భారీ శబ్దం వచ్చిందని రైతు తెలిపాడు. ఆ శబ్దానికి తట్టుకోలేక తన లక్షన్నర విలువ చేసే గేదె చనిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హెలికాఫ్టర్ ను తక్కువ ఎత్తు నుంచి నడిపిన పైలట్ వల్లే తన గేదె మృతి చెందిందని, తనకి నష్ట పరిహారంగా లక్షన్నర చెల్లించాలని ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు చనిపోయిన గేదెను పరీక్ష నిమిత్తం పశువుల ఆసుపత్రికి తరలించారు. గేదె ఎలా చనిపోయిందో నివేదిక వచ్చిన తర్వాత కేసు నమోదు చేస్తామని వెల్లడించారు. దీంతో రైతు నిరుత్సాహంతో వెనుదిరగాల్సి వచ్చింది.