ఉద్యోగం చేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తూ.. బతుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకుని కలలు కంటున్న యువతి జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు ప్రవేశించి.. ఆమె పాలిట యమధూతల్లా దాపురించారు. కేవలం..
సెల్ ఫోన్ ఆమె జీవితాన్నే నాశనం చేసింది. అలా అని ఆమె ఆన్ లైన్ గేమ్స్, సోషల్ మీడియాకు ఎడిక్ట్ కాలేదు. రమ్మీ, బెట్టింగ్స్ పై డబ్బులు పోగొట్టుకోలేదు. పోనీ ఎవ్వరినీ మోసం చేయలేదు.. తాను మోసపోలేదు. కానీ ఆమె చావుకు మాత్రం కారణమైంది ఈ మాయా పేటిక. మరణం సెల్ ఫోన్ రూపంలో వస్తుందని బహుశా ఆమెకు కూడా ఊహించి ఉండదు. ఉద్యోగం చేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తూ.. బతుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకుని కలలు కంటున్న యువతి జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు ప్రవేశించి.. ఆమె పాలిట యమధూతలయ్యారు. కేవలం సెల్ ఫోన్ కోసం ఆమె ప్రాణాలను బలితీసుకున్నారు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
సెల్ ఫోన్ లాక్కోవడమే కాకుండా ప్రతిఘటించిందన్న ఒక్క కారణంతో కదులుతున్న రైలులో నుండి యువతిని తోసేశారు ఇద్దరు దుర్మార్గులు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. చెన్నైలోని కందన్ చావడిలో తిరువిక వీధికి చెందిన 22 ఏళ్ల ప్రీతి కొట్టూరుపురంలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఈ నెల 2న విధులు ముగించుకుని ఇంటికి సబర్బన్ రైలులో బయలు దేరింది. ఈ సమయంలో అదే రైలులో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఆమె సెల్ ఫోన్ దొంగిలించేందుకు ప్రయత్నించగా ప్రీతి ప్రతిఘటించింది. వారితో గొడవ పడింది. కోపంతో ఊగిపోయిన ఇద్దరు.. రైలు ఇందిరా నగర్ స్టేషన్ సమీపానికి రాగానే ఆమెను తోసేశారు.
కదులుతున్న రైలు నుండి పడిపోవడంతో ఆమెకు తీవ్రంగా గాయాలయ్యాయి. తోటి ప్రయాణీకులు, రైల్వే సిబ్బంది ప్రీతిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం యువతి మృతి చెందింది. కాగా, కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇందిరా నగర్ స్టేషన్ సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. నిందితుల్ని విఘ్నేష్ (27), మణిమారన్ (26)గా గుర్తించారు. వారిని అరెస్టు చేసి విచారణ చేపడుతున్నారు. కాగా, ప్రీతి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అయ్యారు. కుటుంబానికి అండగా నిలుస్తున్న సమయంలో సెల్ ఫోన్ ఆమె జీవితాన్నే నాశనం చేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు.