రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని భావిస్తున్న తరుణంలో మహారాష్ట్ర వేరియంట్ గుబులు పుట్టిస్తున్నది. డబుల్ మ్యుటేషన్‌గా పేరొందిన ఈ వేరియంట్ అత్యంత వేగంగా దూసుకువెళ్తోంది. అయితే దేశంలో నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో ప్రతి మూడింట్లో ఒకటి మహారాష్ట్ర వేరియంట్ ఉంటుందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిస్తోంది. కొవిడ్‌లోని ‘బీ.1.617’ రకం వైరస్‌ను మహారాష్ట్ర వేరియంట్‌గా పిలుస్తారు. మహారాష్ట్ర సరిహద్దులోని నిజామాబాద్,ఆదిలాబాద్ జిల్లాల్లో మొదట ఈ వైరస్ వ్యాప్తి చెందినట్టు గతంలో గుర్తించారు.
ఆ తర్వాత ఉత్తర తెలంగాణ జిల్లాలతోపాటు హైదరాబాద్‌లోనూ కేసు లు బయటపడ్డాయి. డబుల్ మ్యూటెంట్ వైరస్ దేశవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్నది. అత్యంత వేగంగా వ్యాప్తి చెందడం, సాధారణ లక్షణాలు పెద్దగా కనిపించకపోవడం, నేరుగా ఊపిరితిత్తులపై ప్రతాపం చూపిస్తుండ టం ఆందోళన కలిగిస్తున్నది. గత మూడు రోజు ల్లో దేశంలో సేకరించిన నమూనాల్లో 60 శాతం మహారాష్ట్ర వేరియంట్ కనిపించిందని గ్లోబల్ ఇనిషియేటివ్ ఆన్ షేరింగ్ ఆల్ ఇన్‌ఫ్లూయెంజా డాటా తెలిపింది.
తాజాగా వరంగల్, వికారాబాద్ జిల్లాల్లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం ఏకంగా నాలుగింట మూడొంతుల నమూనాల్లో మహారాష్ట్ర వేరియంట్ కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. ఏప్రిల్ నుంచి మే 11 వరకు దాదాపు 44 దేశాల్లో 4,500 నమూనాలు పరిశీలించి నివేదిక విడుదల చేసింది. ఈ నివేదికలో మహారాష్ట్ర వేరియంట్‌ను కూడా ప్రస్తావించారు. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా పది రకాల వేరియంట్లు ప్రమాదకరంగా ఉన్నాయని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. ఈ పదింట్లో యూకే, బ్రెజిల్, దక్షిణాఫ్రికా రకం వైరస్‌లు అత్యంత ప్రభావవంతమైనవని తేల్చింది. ఇప్పుడు మహారాష్ట్ర వేరియంట్ కూడా వాటి సరసన చేరింది.