మనకు ఎవరైనా గిఫ్ట్ గా ఒక చిన్న వస్తువు ఇచ్చినా దాన్ని ఎంతో అపురూపంగా చూసుకుంటాం. అలాంటి వస్తువు కనిపించకుండా పోతే ఎంత బాధ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తమిళనాడుకి చెందిన ఓ ఎంపీ తన పెన్ను పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేయడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే..
తమిళనాడుకు చెందిన విజయ్ వసంత్ కాంగ్రెస్ పార్టీ తరుపు కన్యాకుమారి నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. ఆయన తన పెన్ను పోయిందని.. దాని విలువ లక్షా యాభైవేల రూపాయలు ఉంటుందని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అది తన తండ్రి ఎంతో ప్రేమతో బహుమతిగా ఇచ్చాడని.. కాబట్టి అది తనకు ఎంతో ప్రత్యేకమైనదని ఎంపీ విజయ్ వసంత్ పేర్కొన్నారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.
ఎంపి విజయ్ వసంత్ విపక్షాల రాష్ట్రపతిగా పోటీ చేస్తున్న యశ్వంత్ సిన్హా కు చెన్నైలోని గిండీలోని ఒక హోటల్‌లో స్వాగతం పలికేందుకు వెళ్లారు. ఈ క్రమంలో కాంగ్రెస్ సభ్యుల మద్దతుకోరేందుకు కాంగ్రెస్ ఎం.పి. విజయ్ వసంత్ హాజరయ్యారు. అదే సమయంలో తాను తన పెన్ను పోగొట్టుకున్నట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. తన పెన్ను పోవడం తనని షాక్ కి గురి చేసిందని అన్నారు.