మహిళలకు చేదు వార్త. ఇప్పటికే కొండ నెక్కి కూర్చున్న బంగారం, వెండి ధరలు మరింత ప్రియం కానున్నాయి. 2023-2024 ఆర్థిక సంవత్సరానికి గానూ బుధవారం పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. వేతన జీవులకు తీపి కబురు అందిస్తూనే.. మహిళల గుండెలపై గుదిబండ వార్తను మోపారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. బంగారం, వెండి, వజ్రాల ధరలపై కస్టమ్స్ డ్యూటీ పెంచుతున్నట్లు ప్రకటించారు.
పెళ్లిళ్లు, పండుగలతో సంబంధం లేకుండా బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేసే మహిళలకు ఈ వార్త మింగుడు పడని అంశంగా మారింది. ఇప్పటికే ఫ్యూర్ 24 క్యారెట్ల బంగారం ధర 58 వేలకు చేరుకోగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 53 వేల వైపు తొంగిచూస్తోంది. ఇప్పుడు కస్టమ్స్ డ్యూటీ పెరగడంతో బంగారం, వెండి, వజ్రాల ధరలు ఆకాశాన్ని తాకనున్నాయి.