తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల కేసులో విచారణ జరుపుతున్న బెంగళూరు కోర్టు.. కర్ణాటక ప్రభుత్వానికి కీలక ఆదేశాలు ఇస్తూ.. సంచలన తీర్పును వెల్లడించింది. జయలలితపై మరణానికి ముందు ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారు అనే అరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే విచారణ చేపట్టింది తమిళనాడు అవినీతి నిరోధక శాఖ. ఈ విచారణలో రూ. 66 కోట్లు అక్రమ ఆస్తులు తేలడంతో అప్పట్లో జయలలిత, శశికళ, సుధాకరన్, ఇలక్సానాసి అనే నలుగురిపై అవినీతి నిరోధక శాఖ కేసులు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించిన విచారణ కర్ణాటక కోర్టులో జరిగింది. అవినీతి నిరోధక శాక అప్పట్లో స్వాధీనం చేసుకున్న జయలలిత వస్తువులన్నీ చీరలు, బూట్లతో సహా.. కర్ణాటక ఖజానాలో భద్రపరిచారు. ఆ వస్తువులన్నింటినీ వేలం వెయ్యాలని తాజాగా కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది బెంగళూరు కోర్టు.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత నాయకురాలు జయలలిత అక్రమాస్తుల కేసులో జప్తు చేసిన వస్తువులను వేలం వెయ్యాలని సామాజిక కార్యకర్త బెంగళూరు చీఫ్ సిటీ సివిల్ సెషన్స్ కోర్టులో పిటీషన్ వేశాడు. బెంగళూరు కు చెందిన సామాజిక కార్యకర్త నరసింహమూర్తి ఈ పిటీషన్ ను సమర్పించాడు. అదేవిధంగా కర్ణాటక హైకోర్టుకు, సుప్రీం కోర్టుకు కూడా లేఖలు రాశాడు నరసింహమూర్తి. ఈ నేపథ్యంలోనే బెంగళూరు ప్రిన్సిపల్ సిటీ సివిల్ సెషన్స్ కోర్టు జడ్జి రామచంద్ర హుట్టర్ ఈ పిటీషన్ పై విచారణ జరిపారు. అనంతరం తన తీర్పును వెల్లడిస్తూ.. జయలలిత చీరలు, బూట్లతో సహా 29 వస్తువులను వేలం వెయ్యాలి. ఇందుకు సంబంధించిన పనులను వెంటనే పూర్తి చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక న్యాయవాదిని నియమించుకోవాలి, అలాగే వేలం ప్రక్రియను వెంటనే పూర్తి చేయలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇక సామాజిక కార్యకర్త తన పిటీషన్ లో కేవలం 3 రకాల వస్తువులను మాత్రమే వేలం వెయ్యాలని కోరగా.. కోర్టు మాత్రం 29 వస్తువులు వేలం వెయ్యాలని ఆదేశించడం గమనార్హం. ఈ వేలానికి సంబంధించిన ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కోరుతూ.. త్వరలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల కాపీని అందిస్తానని సామజిక కార్యకర్త నరసింహమూర్తి తెలిపాడు. మరి అక్రమాస్తుల జప్తు కేసులో జయలలిత చీరలు వేలం వేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.