చైనా, పాకిస్తాన్ వంటి శత్రుదేశాలు నేలపై నుంచే కాకుండా నీటిపైనుంచి కూడా దాడులకు దిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత రక్షణ శాఖ మంత్రి నావికా దళానికి ఓ పిలుపు నిచ్చారు. భవిష్యత్తు గొడవలకు సిద్ధంగా ఉండాలని అన్నారు.
గత కొన్నేళ్లుగా భారత్- చైనాల మధ్య గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గత మూడు, నాలుగేళ్ల కాలంలో చైనా అక్రమంగా భారత్ సరిహద్దు ప్రాంతాల్లోకి చొరబడ్డానికి చూసింది. దీన్ని తిప్పే కొట్టే ప్రయత్నం చేసిన భారత బలగాళపై దాడులకు దిగింది. లడఖ్, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో జరిగిన గొడవల్లో పలువులు భారత సైనికులు మృత్యువాతపడ్డారు. పాకిస్తాన్ విషయంలోనే ఇలాంటి పరిస్థితే నెలకొంది. చేసుకున్న ఒప్పందాలను తుంగలో తొక్కి.. పాకిస్తాన్ ఆర్మీ సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులకు పాల్పడుతోంది. ఈ కారణంగా చాలా మంది భారత సైనికులు, సాధారణ ప్రజలు చనిపోతున్నారు. నేలపై నుంచే కాకుండా భవిష్యత్తులో నీటి పైనుంచి కూడా శత్రు దేశాలు దాడులకు పాల్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులోనూ ఇలాంటి ఘటనలు కొనసాగే అవకాశం ఉందని, నావికా దళం అన్నిటికి సిద్ధంగా ఉండాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పిలుపునిచ్చారు.
సోమవారం గోవాలో జరిగిన ఓ సమావేశంలో ఆయన సీనియర్ నావీ అధికారులతో మాట్లాడుతూ.. ‘‘ భవిష్యత్తులో జరగబోయే గొడవల్ని ఊహించటం కష్టం. ఎప్పటికప్పుడు మారుతున్న ప్రపంచ తీరు కొత్త ప్రణాళికలను రచించేలా చేస్తోంది. మొత్తం తీర ప్రాంతంపై పహారా ఉండాలి. భవిష్యత్తులో ఎదురవ్వబోయే సవాళ్లను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి. మన నావికా దళంలోని ఆధునాతన యంత్రాలు మనల్ని హిందూ మహా సముద్ర ప్రాంతంలోని మిత్ర దేశాలతో సమానంగా నిలబెట్టాయి. దేశ ఆర్థిక, సామాజిక పరిస్థితులు సరిహద్దు ప్రాంత రక్షణపైనే ఆధారపడి ఉంటాయి. దేశ రక్షణ, ఎకానమీ వృద్ధి సంబంధం ఉంది. దేశం సురక్షితంగా ఉన్నప్పుడే ఆర్థిక వృద్ధి సాధ్యం అవుతుంది’’ అని అన్నారు.