కేరళలో ఖైదీ మూవీ సన్నివేశం రిపీట్ అయ్యింది. భారీ స్కెచ్ వేసి మరీ రూ. 12 వేల కోట్ల విలువైన డ్రగ్స్ ను పట్టుకున్నారు. సముద్రజలాల్లో భారత్ కు డ్రగ్స్ ని తరలిస్తున్న ఓడను ఛేజ్ చేసి మరీ 2500 కిలోల ప్రమాదకరమైన డ్రగ్ ని పట్టుకున్నారు.
దేశ చరిత్రలోనే అత్యధికంగా కేరళ తీరంలో రూ. 12 వేల కోట్లు విలువ చేసే డ్రగ్స్ ను నేవీ, నార్కోటిక్ అధికారులు కలిసి పట్టుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఓ ఓడలో అక్రమంగా తరలిస్తున్న 2500 కిలోల మెథామ్ ఫెటమైన్ అనే మత్తు పదార్థాలను నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డు (ఎన్సీబీ) స్వాధీనం చేసుకుంది. సముద్ర మార్గంలో మత్తు పదార్థాల రవాణాను అరికట్టేందుకు నేవీ, నార్కోటిక్స్ అధికారులు సంయుక్తంగా ‘ఆపరేషన్ సముద్రగుప్త్’ పేరుతో సీక్రెట్ ఆపరేషన్ ను నిర్వహించారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయలుదేరిన భారీ ఓడ ఒకటి మక్రాన్ తీరం వెంబడి పాక్, ఇరాన్ ల మీదుగా చిన్న పడవల్లోకి మత్తుపదార్థాలను పంపిణీ చేసుకుంటూ వస్తుందని అధికారులు వెల్లడించారు.
డ్రగ్స్ స్మగ్లింగ్ కు సంబంధించి ఖచ్చితమైన సమాచారం అందడంతో ఓడ కదలికలపై ఇంటిలిజెన్స్ వర్గాలు నిఘా పెట్టాయి. ఈ ఓడ కేరళ తీరం ద్వారా శ్రీలంకకు వెళ్తుందని.. ఈ ఓడకు ఎస్కార్ట్ గా మరో రెండు పడవలు వస్తున్నాయని అధికారులు తెలిపారు. పెద్ద ఓడను పట్టుకోవడం చూసి చిన్న పడవల్లో ఉన్న స్మగ్లర్లు తప్పించుకున్నారని అధికారులు వెల్లడించారు. ఓడలో ఉన్న పాకిస్తానీని అరెస్ట్ చేసినట్లు ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సంజయ్ కుమార్ సింగ్ వెల్లడించారు. 134 సంచుల్లో మత్తుపదార్థాలను తీసుకొస్తుండగా మట్టన్ చెర్రీ వద్ద ఓడను అడ్డుకున్నట్లు వెల్లడించారు. భారత్, శ్రీలంక, మాల్దీవులకు డ్రగ్స్ చేరవేయడమే స్మగ్లర్ల లక్ష్యమని అధికారులు తెలిపారు.
ఇప్పటి వరకూ 3200 కిలోల మెథామ్ ఫెటమైన్, 500 కిలోల హెరాయిన్, 529 కిలోల హషిష్ డ్రగ్స్ ని పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. మెథామ్ ఫెటమైన్ అనేది చాలా పవర్ ఫుల్ డ్రగ్. ఒక్కసారి తీసుకుంటే దీనికి ఎవరైనా అత్యంత వ్యసనపరులైపోతారు. అంతలా ఇది కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. విపరీతమైన ఆందోళన, మెదడు నిర్మాణం, పనితీరును మార్చేస్తుంది. జ్ఞాపకశక్తి నశించడం, నిద్ర సమస్యలు, హింసాత్మకంగా ప్రవర్తనను పెంచడం సహా అనేక అనారోగ్య సమస్యలను కలగజేస్తుంది. అంత ప్రమాదకరమైన డ్రగ్స్ ను నార్కోటిక్స్, నేవీ అధికారులు కలిసి సంయుక్తంగా రహస్య ఆపరేషన్ నిర్వహించి పట్టుకున్నారు.