ప్రపంచంలోనే అపర కుబేరుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి అంటేనే వార్త. 2018 అంబానీ కుమార్తె ఇషా పెళ్లి దగ్గర నుండి ఇటీవల జరిగిన చిన్నకుమారుడు అనంత్ నిశ్చితార్థం వరకు ప్రతీదీ హాట్ టాపికే. ఎక్కడ పెళ్లి చేసుకుంటారు, ఎంత ఖరీదైనా దుస్తులు వేసుకున్నారు, నగలు, పెళ్లి కార్డు, వంటలు, వచ్చే సెలబ్రిటీల గురించి మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి. వీరి పెళ్లిని ఇక్కడ మీడియానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మీడియా కూడా కవర్ చేస్తుంది.
అయితే వీటన్నింటికి కన్నా ఆసక్తి కరమైన విషయం. ముఖేష్ అంబానీ ఇంట్లో అడుగుపెట్టే అల్లుడు, కోడళ్ల గురించే. ముఖేష్ ముద్దుల తనయ ఇషా, పిరమిల్ సంస్థకు చెందిన ఆనంద్ ను వివాహం చేసుకోగా.. పెద్ద కుమారుడు ఆకాష్, వజ్రాల వ్యాపారి శ్లోకా మెహతాను మనువాడారు. అనంత్ ను వివాహం చేసుకుంటున్న అమ్మాయి పేరు రాధికా మర్చంట్. ఎన్ కోర్ హెల్త్ కేర్ సిఇఒ వీరేన్ మర్చంట్, శైలా మర్చంట్ ల కుమార్తె. రాధికకు అనంత్ తో చాలా కాలంగా స్నేహం ఉంది. ఆమె భరత నాట్యంలో శిక్షణ పొందారు. అయితే అల్లుడు ఆనంద్, పెద్ద కోడలు శ్లోకా కన్నా ఆమె ఆస్తులు తక్కువని తెలుస్తుంది.
రాధిక ముంబయిలో ప్రాథమిక విధ్యాభ్యాసం పూర్తి చేశాక, న్యూయార్క్ నుండి పాలిటిక్స్, ఎకనామిక్స్ బ్యాచిలర్స్ డిగ్రీ పొందారు. ఇండియా ఫస్ట్ ఆర్గనైజేషన్, దేశాయి అండ్ దివాన్ అనే లా ఫర్మ్ లో ఇంటర్నషిప్ చేశారు. చదువు పూర్తయ్యాక సెలవుల్లో ఇస్ప్రవ గ్రూప్ లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఎన్ కోర్ హెల్త్ కేర్ కంపెనీల్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఒకరుగా ఉన్నారు. ఆమెకు లలిత కళల్లో కూడా ప్రావీణ్యం ఉంది. ఆకాష్-శ్లోకా పెళ్లి సమయంలో తొలిసారిగా రాధికా పేరు వినిపించింది. అప్పుడప్పుడు పలు పార్టీలో తళుక్కుమని, ఖరీదైన వస్తువులు ధరించి వార్తల్లో నిలిచారు. భరత నాట్య కళాకారిణి అయిన రాధికా.. గత ఏడాది జూన్ లో ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్ అరంగ్రేటం చేసిన సంగతి విదితమే.
రాధిక తండ్రి వీరేన్ గుజరాత్ లోని కచ్ ప్రాంతానికి చెందినవారు. ఆయన ఎన్ కోర్ హెల్త్ కేర్ సీఇఓగా ఉన్నారు. ఇదే కాకుండా ఎన్ కోర్ నాచురల్ పాలిమర్స్, ఎన్ కోర్ పాలీప్రాక్ ప్రొడక్స్ట్, ఎన్ కోర్ బిజినెస్ సెంటర్, సాయి దర్శన్ బిజినెస్ సెంటర్, జెడ్ వైజీ ఫార్మా వంటి కంపెనీలున్నాయి. ఈ కంపెనీలన్నీ వివిధ మల్టీ నేషనల్ సంస్థలకు సేవలందిస్తున్నాయి. ఇక్కడే కాక విదేశాల్లో కూడా ఈ కంపెనీ విస్తరిస్తోంది. వీరి మొత్తం ఆస్తి విలువ రూ. 755 కోట్ల వరకు ఉంటుందని వినికిడి. కాగా, రాధికా మర్చంట్ కు రూ. 8 కోట్ల నుండి 10 కోట్ల వరకు ఆస్తి ఉందని సమాచారం.
ఏడు లక్షల కోట్లకు పైగా ఆస్తి ఉన్న అంబానీ..తమ కంటే తక్కువ ఆస్తులు కలిగిన ఇంటి నుండి అమ్మాయిని కోడలిగా తెచ్చుకోవడం ఇప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రాధికా స్వయం కృషితో ఎదగటంతో పాటు భరత నాట్యం వంటి కళల్లో ప్రావీణ్యాన్ని ప్రదర్శించడంతో ఆమెపై ముఖేష్ కుటుంబానికి మొదటి నుండి మంచి అభిప్రాయమేర్పడింది. అయితే అనంత్, రాధికా ప్రేమించుకోవడంతో.. ఆస్తులు చూడకుండా, కుమారుడి ఇష్ట ప్రకారం పెళ్లి చేయాలని ముఖేష్ అంబానీ కుటుంబం భావించినట్లు సమాచారం. ఇక ఏముందీ ఇటీవలే నిశ్చితార్థ తంతును ముగించారు. మరికొన్ని రోజుల్లోనే మిలీనియర్ ఇంట్లో కోడలుగా అడుగుపెట్టబోతోంది రాధికా మర్చంట్.