ఆషాఢం ఆఫర్ వలే మద్యం షాపుల్లో కూడా రాయితీలు పెట్టారు. రెండు బీర్లు కొంటే మరో బీర్ ఉచితం. మందు కొన్నవారి షాపులో గుడ్డు ఉచితమని ఇలా కొన్ని ఆఫర్లు ప్రకటించారు.
ప్రస్తుతం షాపింగ్ మాల్స్‌లో ఆషాఢం సేల్ నడుస్తుంది. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌లో ఆఫర్లు పెడుతున్నారు. కేజీ సేల్ కూడా నడుస్తుంది. మనకు నచ్చిన బట్టలను కేజీల చొప్పున కొనుక్కోవచ్చు. 50 శాతం డిస్కౌంట్ కూడా ఆఫర్ ఉంది. ఇలా వస్త్ర దుకాణాలు కాకుండా వేరే షాపుల్లో కూడా ఆపర్లు పెడుతారు. ఆఫర్లతో సరుకు ఎక్కకువగా సేల్ అవుతుంది. అయితే ఇదే మాదిరిగా మద్యం ప్రియులకు కూడా శుభవార్త తెలిపారు. మద్యం షాపుల్లో కూడా చాలా ఆఫర్లు ఉన్నాయి. మద్యం షాపుల్లో ఆఫర్లు ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా? మరి ఆ ఆఫర్లు ఏంటో.. ఎక్కడ ఇస్తున్నారో.. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
దేశంలోని రాష్ట్రాలన్నింటిలో కంటే కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని మద్యం చాలా ఫేమస్.. అంతేకాదండోయ్ చాలా టేస్టీగా ఉంటుందట. వీకెండ్స్‌లో చుట్టుపక్కల రాష్ట్రాలనుండి మద్యం ప్రియులు పుదుచ్చేరికి వచ్చి ఎంజాయ్ చేస్తారట. ఇక్కడ 900 రకాల మద్యం, 35 రకాల బీర్లు దొరుకుతాయి. పుదుచ్చేరిలో మద్యం వెరైటీస్కి, టేస్ట్‌కు కూడా మందుబాబులు ముగ్ధులవుతారు. ఈ రాష్ట్రంలో మద్యం దుకాణాలు విపరీతంగా ఉంటాయి. వాటికి తగ్గ బార్లు కూడా ఉంటాయి. ఈ మధ్యకాలంలో మద్యం షాప్స్‌లో చాలాపోటీ నెలకొంది. మందుబాబులను ఆకట్టుకునేందుకు మద్యం షాప్స్ కొన్ని ఆఫర్లు కూడా ప్రకటించాయి. వారి షాప్ లో మందు కొంటే కోడిగుడ్డు ఫ్రీ అని .. రెండు బీర్లు కొంటే మరొక బీరు ఫ్రీ అని ఆకర్షనీయమైన రాయితీలు పెట్టారు.
రాష్ట్రానికి వచ్చే పర్యాటకులను ఆకట్టుకునేందుకు పర్యాటకుల గది వద్దకే మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీరు తాగేవారిని ఆకర్షించేందుకు చెన్నై నుండి పుదుచ్చేరికి ‘బీర్ బస్’ను నడిపేందుకు ప్రయత్నించారు. కొన్ని వర్గాలవారు విమర్శలు రావడంతో బస్ సర్వీసులు రద్దు చేశారు. ఈస్ట్‌కోస్ట్ రోడ్డులో మహిళల కోసం స్పెషల్‌గా మద్యం బార్లు ఏర్పాటుచేశారు. ఈ బార్లలో మగువలే మద్యాన్ని సరఫరా చేస్తారు. ఇంకొన్ని బార్లలో మహిళలకు మద్యం ఉచితంగా అందిస్తామంటూ ఇంటర్నెట్లో ప్రకటనలు వచ్చాయి. మద్యం గురించి ప్రకటనలు చేయడం శిక్షార్హమైన నేరం అంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నా.. మద్యం దుకాణాదారులు పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం పుదుచ్చేరిలో మద్యం ప్రియులు ఆఫర్లను వినియోగించుకుంటున్నారు.