సాధారణంగా ఏదైనా నేరం జరిగితే.. పోలీసులు కేసును దర్యాప్తు చేసి సాక్ష్యాలను సేకరించి.. కోర్టులో ప్రవేశపడతారు. ఆ తర్వాత నిందితులకు శిక్ష పడుతుంది. ఇక తాజాగా ఓ కేసులో చిలుక సాక్ష్యం చెప్పడం వింతగా మారింది. ఆ వివరాలు..
మనుషులకన్నా మూగ జీవాలకు విశ్వాసం ఎక్కువ. వాటి మీద కాస్త ప్రేమ, ఆదరణ చూపితే.. చాలు జీవితాంతం మన పట్ల విశ్వాసంగా ఉంటాయి. అయితే చాలా మంది కుక్కలకే విశ్వాసం ఎక్కువగా ఉంటుంది అని భావిస్తారు. అయితే తాజాగా ఈ జాబితాలోకి చిలుక కూడా చేరింది. కళ్ల ముందే తన యజమానురాలు దారుణంగా హత్యకు గురైంది. పోలీసులు ఎంత ప్రయత్నించినా సాక్ష్యాలు దొరకలేదు. కానీ పెంపుడు చిలుక ఇచ్చిన సాక్ష్యంతో.. పోలీసులు దోషులను అరెస్ట్ చేశారు. కోర్టు కూడా వారికి జీవిత ఖైదు విధించింది. అంతా బాగానే ఉంది కానీ.. ఇంతకు చిలుక ఎలా సాక్ష్యం చెప్పింది.. దానికి మాటలు వచ్చా.. కోర్టులో చిలుక సాక్ష్యం ఎలా చెల్లింది అనే అనుమానాలు బుర్రను తొలిచేస్తున్నాయా.. అయితే ఇది చదవండి.
ఈ వింత సంఘటన ఆగ్రాలో చోటు చేసుకుంది. నేరం జరిగింది కూడా తొమ్మిదేళ్ల క్రితం అనగా 2014లో. ఏం జరిగింది అంటే.. ఆగ్రాకు చెందిన విజయ్‌శర్మ భార్య నీలమ్‌శర్మ 2014 ఫిబ్రవరి 20న తన ఇంట్లోనే హత్యకు గురయ్యింది. వారి ఇంట్లో ప్రవేశించిన నిందితులు నీలమ్ శర్మతో పాటు, వారి పెంపుడు కుక్కను పదునైన ఆయుధంతో పలుమార్లు పొడిచి అత్యంత దారుణంగా హత్య చేసినట్లు పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కొంతమంది అనుమానితులను విచారించారు. కానీ లాభం లేకపోయింది. వారి దగ్గర నుంచి సరైన సాక్ష్యాధారాలు లభించలేదు. ఇదిలా ఉండగా.. హత్య జరిగిన తర్వాతి రోజు నుంచి విజయ్‌శర్మ పెంపుడు చిలుక సరిగా తినకపోవడం, అతడి మేనకోడలు అషు ఇంటికి వచ్చిన ప్రతిసారీ ఆమెను చూసి అరుస్తుండటం చేసేది.
ఈ క్రమంలో పెంపుడు చిలుక తన భార్యను హత్య చేసిన వారిని చూసి ఉంటుందేమో అనే అనుమానం మొదలైంది విజయ్ శర్మలో. పైగా తన మేనకోడలిని చూసిన ప్రతి సారి చిలుక అరుస్తుండటం కూడా అతడిలో అనుమానాలు పెంచింది. దాంతో చిలుక తీరు గురించి పోలీసులకు చెప్పాడు. అప్పటికే కేసులో ఎలాంటి సాక్ష్యాలు లభించకపోవడంతో.. విసిగిపోయిన పోలీసులు.. విజయ్ శర్మ చెప్పిన దిశగా ప్రయత్నించి చూద్దామని భావించారు. ఈ క్రమంలో గతంలో విచారించిన అనుమానితులతోపాటు అషును కూడా చిలుక ముందు నిలబెట్టారు పోలీసులు. అప్పుడు కూడా అషును చూడగానే చిలుక అరుస్తుండటంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు.
దాంతో అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చారు. అషునే నీలమ్ శర్మను హత్య చేసినట్లు అంగీకరించింది. నగలు, డబ్బు కోసం తానే హత్య చేసినట్లు అషు అంగీకరించింది. ఇందుకోసం రోన్నీ అనే వ్యక్తి సాయం తీసుకున్నట్లు వెల్లడించింది. పోలీసులు చార్జిషీట్‌లో చిలుక వాంగ్మూలం గురించి ప్రస్తావించినప్పటికీ.. దాన్ని సాక్షిగా కోర్టులో ప్రవేశపెట్టలేదు. హత్య జరిగిన ఆరు నెలల తర్వాత చిలుక చనిపోయింది. తాజాగా ఈ కేసులో ప్రత్యేక న్యాయస్థానం జడ్జి దోషులిద్దరికీ జీవితఖైదు విధించారు. మరి ఈ వింత సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.