చిన్న పిల్లలకి ఏమైనా అయితే ఎవ్వరూ తట్టుకోలేము. కొంచెం పెద్ద వయసున్న పిల్లలకే ఏమైనా అయితే విలవిలలాడిపోతాం. అలాంటిది అప్పుడే పుట్టిన పసిపిల్లలకి ఏమైనా అయితే ఇంకేమైనా ఉందా? నిండా ఏడాది కూడా లేదు. కనీసం నెల రోజులు కూడా నిండలేదు. 21 రోజుల పాప కడుపులో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 8 పిండాలు ఉన్నాయి. మామూలుగా కడుపులో చిన్న కణతి ఉంటేనే పెద్దోళ్ళు విలవిలలాడిపోతారు. అలాంటిది ఈ చిన్నారి పాప కడుపులో 8 పిండాలు ఉండడం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. డాక్టర్స్ ని సైతం విస్మయానికి గురి చేసిన ఈ ఘటన జార్ఖండ్ లోని రామ్ గఢ్ లో చోటు చేసుకుంది.
ఓ మహిళకు ఇటీవల ఒక ఆడబిడ్డ పుట్టింది. 2 రోజుల నుంచి పాప గుక్కపెట్టి ఏడుస్తూనే ఉంది. తల్లిదండ్రులు హాస్పిటల్ కి తీసుకెళ్లగా.. కడుపు నొప్పితో ఏడుస్తుందని వైద్యులు చెప్పారు. స్కానింగ్ చేయగా కడుపులో కణతులు ఉన్నట్టు తెలిసింది. కణతులను తొలగించేందుకు వైద్యులు సర్జరీ నిర్వహించారు. సర్జరీ చేస్తుండగా వైద్యులకు విస్మయానికి గురి చేసే విషయం బయట పడింది. అవి కణతులు కాదు, పిండాలు అని గుర్తించారు. 8 పిండాలు ఉన్నట్టు గుర్తించిన వైద్యులు.. మొత్తానికి ఆ పిండాలను తొలగించి పాపను ప్రాణాలతో కాపాడారు. చిన్నారి కడుపులో 8 పిండాలు ఉండడం అనేది ప్రపంచంలో ఇదే మొదటి కేసు అని వైద్యులు వెల్లడించారు. పాపం ఆ చిట్టి తల్లి ఎంత బాధపడి ఉంటుందో కదా.