పాముని చూడగానే మనలో చాలా మంది భయంతో వణికిపోతారు. ఇక చిన్న పిల్లలు అయితే పాముని చూడగానే పరుగులు తీస్తారు. కానీ.., ఆ బాలుడు మాత్రం తనని పాము కాటేసినా.. ఏ మాత్రం భయపడలేదు. ఏకంగా ఆ పాముని చంపేసి, తనతో పాటు హాస్పిటల్ కి పట్టుకెళ్లి అందరిని ఆశ్చర్యపరిచాడు. తమిళనాడులోని కాంచీపురం ఏకనాంపేట్టలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..,
తమిళనాడులోని కాంచీపురం ఏకనాంపేట్టలో రాము అనే రైతు జీవిస్తున్నాడు. ఇతని కుమారుడుపేరు దర్షిత్. అతని వయసు 7 సంవత్సరాలు. మూడో తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం స్కూల్స్ లేకపోవడంతో వెల్‌లైకోట్టై గ్రామంలోని తన అవ్వ ఇంటికి వెళ్ళాడు. అక్కడ పొలంలో ఆడుకుంటుండగా దర్షిత్ కి తనని ఏదో కరిచినట్టు అనిపించింది. వెంటనే ఆ పరిసర ప్రాంతాల్లో వెతికాడు. రక్తపింజరి జాతి విషనాగు తనని కరిచి వెళ్లిపోతున్న విషయాన్ని దర్షిత్ పసిగట్టాడు. అంతే.., పొలంలో నక్కి నక్కి వెళ్తున్న ఆ పాముని వెంటాడి వేటాడి పట్టుకుని రాళ్లతో కొట్టి చంపేశాడు.
తరువాత ఆ చచ్చిన పామును పట్టుకుని ఇంటికి చేరుకున్నాడు దర్షిత్. అక్కడ నుండి తల్లిదండ్రులతో కలిసి కాంచీపురం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాడు. అయితే.., అప్పటికే దర్షిత్ కాలు వాచిపోయి ఆరోగ్యం విషమించడంతో మెరుగైన చికిత్స కోసం చెన్నై ఎగ్మూరులోని ప్రభుత్వ పిల్లల ఆస్పత్రికి తరలించారు. అక్కడ దర్షిత్ పూర్తిగా కోలుకున్నాడు. అయితే.., ఇక్కడ కోస మెరుపు ఏమిటో తెలుసా? చచ్చిన పామును ఆసుపత్రికి ఎందుకు తీసుకొచ్చావని వైద్యులు ఆ పిల్లాడిని ప్రశ్నించారు. దానికి.. “నన్ను ఏ జాతి పాము కాటేసిందో తెలిస్తేనే కదా మీరు తగిన చికిత్స అందించేది” అని దర్షిత్ బదులివ్వడంతో బిత్తరపోవడం డాక్టర్స్ వంతు అయ్యింది. మరి.. దర్షిత్ దైర్య, సాహసాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.